ఇంతకాలం అనుమానంగా ఉన్న ఫోన్ల ట్యాపింగ్ నిజమే అని తేలింది. తమ నేతల ఫోన్లను ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ట్యాప్ చేస్తోందంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి హై కోర్టులో కేసు వేశారు. దానిపై స్పందించిన కోర్టు ఇంటెలిజెన్స్, హోం శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపితో పాటు టెలికమ్యూనికేషన్ శాఖతో పాటు ఆపరేటర్లకు నోటీసులు ఇచ్చింది.

 

కోర్టు నోటీసులపై స్పందించిన రాష్ట్రప్రభుత్వం మొత్తానికి వైసిపి నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోంది నిజమే అని అంగీకరించింది. దాదాపు రెండేళ్ళుగా వైసిపి నేతలు చాలామంది ట్యాపింగ్ జరుగుతోందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న వైసిపి నేతలు కోర్టును ఆశ్రయించారు.

 

 వైసిపిలో గట్టి నేతలుగా అనుమానిస్తున్న నేతల్లో సుమారు 40 మంది ఫోన్లపై ప్రభుత్వం నిరంతర నిఘాను పెట్టినట్లు అనుమానిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, బొత్సా సత్యనారయణ, విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, వాసిరెడ్డి పద్మ లాంటి అనేక మంది నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

 

అందుకనే వైసిపిలోని నేతలు స్వేచ్చగా తమ ఫోన్ల నుండి అవసరమైన వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు.  అవసరార్ధం తమతో ఉన్న వారిలో ఎవరో ఒకరి ఫోన్ నుండి మాట్లాడుతున్నారు. ఫోన్ సంభాషణలను, ఎస్ఎంఎస్ లతో పాటు చివరకు వాట్సప్ సమాచారంపై కూడా నిఘా పెట్టారని అనుమానిస్తున్నారు. 

 

ఇక్కడ విచిత్రమేమిటంటే దేశ సమగ్రత, సార్వభౌమత్వం, దేశభద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, నేర ప్రేరేపణను నిరోధించటం లాంటి అంశాల పరిధిలో వైసిపి నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ప్రభుత్వం అంగీకరించింది. వీరే కాకుండా అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఉన్నతాధికారుల్లో ఎవరైనా వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ సమాచారాన్ని చేరవేస్తున్నారా అన్న అనుమానంతో నిఘా ఉంచినట్లు సమాచారం. మొత్తానికి హై కోర్టు జోక్యం వల్ల వైసిపి నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు అంగీకరించింది. కాకపోతే ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ లో పెట్టిందన్న విషయం  తెలియాల్సుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: