నిజానికి గెలుపుపై  బెట్టింగులు కడుతున్నారంటే పవన్ కల్యాణ్ ను అవమానించటమనే చెప్పాలి. ఎందుకంటే పవన్ జనసేన అధినేత మాత్రమే కాదు. పెద్ద సెలబ్రిటీ కూడా. ఇక రెండూ కలిస్తే పెద్ద ప్రభంజనమే అవ్వాలి. అలా అనుకునే రాజకీయాల్లోకి దిగారు పవన్. కానీ అనుకున్నదొకటయితే అయ్యిందొకటి లాగ తయారైంది పరిస్ధితి. పవన్ ఎక్కడ పోటీ చేసినా ప్రత్యర్ధులు గడగడలాడటమే కాకుండా గెలుపుపై ఆశలు కూడా వదిలేసుకోవాలి. అలాంటిది గెలుపోటములపై బెట్టింగులు జరుగుతున్నాయంటే పవన్ కు ఎంత అవమానం. చంద్రబాబు, జగన్ గెలుపుపై ఎవరైనా బెట్టింగులు కడుతున్నారా ?

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపైన కూడా బెట్టింగ్ జోరందుకుంది. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమంటూ బెట్టింగ్ ల జోరందుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.  ఏ ముహూర్తంలో నామినేషన్ వేశారో కానీ రెండుచోట్లా పవన్ ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

 

నామినేషన్ వేసిన మొదటినుండి భీమవరంలో తేడా కనబడుతునే ఉంది. అక్కడ కాపుల్లో కొందరు పవన్ వైపు మొగ్గు చూపినా మిగిలిన సెక్షన్లు అన్నీ వైసిపివైపు మొగ్గు చూపినట్లు అందరికీ అర్ధమైపోయింది. కాబట్టి భీమవరంలో పవన్ ఓటమి దాదాపు ఖాయమనే అనుకుంటున్నారు.

 

ఇక గాజువాకలో పరిస్ధితి కాస్త వేరుగా ఉంది. ఇక్కడ పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గ ఓట్లు బాగానే ఉన్నాయి. అందుకనే ఇక్కడ పవన్ గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ చివరి నిముషంలో సీన్ అడ్డం తిరిగింది. చంద్రబాబు చేసిన కంపు వల్ల పరిస్ధితిలో కన్ఫ్యూజన్ మొదలైంది. పవన్ గెలుపు కోసం టిడిపి అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ ను త్యాగం చేయాలని చంద్రబాబునాయుడు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

 

అయితే చంద్రబాబు ఆదేశానికి టిడిపి అభ్యర్ధి అడ్డం తిరిగారట. సిట్టింగ్ ఎంఎల్ఏ అయిన తనను త్యాగం చేయమనటంలో అర్ధం లేదన్నారట. అయినా చంద్రబాబు పవన్ కే మద్దతు ఇవ్వమని నేతలందరికీ  చెప్పారని సమాచారం. దాంతో తన గెలుపు కష్టమని భావించిన పల్లా వెంటనే వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డికి లోపాయికారీగా మద్దతు పలికినట్లు తెలుస్తోంది. లోకల్ , నాన్ లోకల్ అనే పద్దతిలో నాగిరెడ్డికి పల్లా మద్దతిచ్చారట. ఎందుకంటే, పవన్ ఇక్కడ నాన్ లోకల్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

అంటే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కు వ్యతిరేకంగా వైపిపి, టిడిపిలు కలిసిపోయాయి. కాబట్టి ఇక్కడ కూడా పవన్ గెలుపు డౌటేనట. అయితే గెలుపోటములను పక్కనపెడితే రెండు చోట్ల పవన్ గెలుస్తాడంటూ బెట్టింగులైతే జోరందుకున్నాయి. పనిలో పనిగా నరసాపురం, రాజోలు, అవనిగడ్డ, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో కూడా జనసేన గెలుపుపై బెట్టింగులు పెరుగుతున్నాయి. మరి బెట్టింగ్ రాయళ్ళ ధైర్యం ఏమిటో ?


మరింత సమాచారం తెలుసుకోండి: