తనను కలిసి ఓదార్చటానికి వచ్చిన నేతలతో చంద్రబాబునాయుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నారట. మన గెలుపు తథ్యం అనుకున్నాం. ఓడిపోయినా ఏ 15 సీట్ల తేడాతో ఓడిపోతామని కూడా అంచనా వేశాం. కానీ ఇదేంటి మరీ ఇంత ఘోరంగా ఓడిపోవటమా ? వైసిపికి 151 సీట్లొస్తే టిడిపికి కేవలం 23నా ? అంటూ ప్రశ్నిస్తున్నారట. తనలో తానే  చంద్రబాబు తెగ బాధ పడుతున్నారట.

 

దేశంలో ఎక్కడా లేని విధంగా 130 సంక్షేమ పథకాలు అమలు చేశాం కదా ? అని అడుగుతున్నారట. అయినా మన పాలనలో జనాలు అంత కష్టపెట్టామా ? మన పాలన అంత ఘోరంగా ఉందా అంటూ కుమిలిపోతున్నారట. ఈ విషయాన్ని జాతి మీడియానే ప్రముఖంగా ప్రచురించింది కాబట్టి నిజమే అని అనుకోవాలి.

 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు అండ్ కోలో  అంతర్మధనం మొదలైంది.  ఓటమి బాధ కాదుకానీ ఓడిపోయిన విధానమే చాలా బాధగా ఉందని చంద్రబాబు తెగ ఫీలైపోతున్నారట. తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ తన పాలనలో ఎక్కడ తప్పులు జరిగాయో చెప్పమని అడుగుతున్నారట.

 

మొత్తం మీద రెండు అంశాల వల్లే టిడిపి ఘోరంగా ఓడిపోయిందని ప్రాధమికంగా చంద్రబాబు అండ్ కో తేల్చారట. మొదటిదేమో పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్, రెండోదేమో ఆర్ధిక సమస్యలట. పవన్ పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని అనుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్ ఒకటే అన్న వైసిపి ప్రచారాన్ని జనాలు బాగా నమ్మారట. అందుకనే పవన్ కు పడాల్సిన ఓట్లు కూడా వైసిపికే పడ్డాయని తేల్చారు.

 

జనసేన వల్ల కనీసం 30 నియోజకవర్గాల్లో టిడిపికి భారీగా నష్టం జరిగిందని సమావేశంలో తేల్చారు. ఎందుకంటే గెలిచిన వైసిపి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కన్నా జనసేనకు పడిన ఓట్లే ఎక్కువగా టిడిపి గుర్తించింది. ఇక ఆర్ధిక వనరుల విషయంలో కూడా ఓ 30 నియోజకవర్గాల్లో టిడిపి బాగా వెనకబడిపోయిందని తేల్చారు సమావేశంలో. 

 

మోడి, కెసియార్ దన్నుతో టిడిపి అభ్యర్ధులకు ఆర్ధిక వనరులు అందకుండా వైసిపి అడ్డుకోవటంలో సక్సెస్ అయ్యారని చంద్రబాబు అండ్ కో అభిప్రాయానికి వచ్చారు. టిడిపి ఖర్చును అడ్డుకోవటంతో పాటు వైసిపి మాత్రం ధారళంగా డబ్బును ఖర్చు చేసిందని కూడా తేల్చారు. దాంతో టిడిపి ఘోర పరాజయానికి కారణాలను చంద్రబాబు తేల్చేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: