కార్డిఫ్‌: టీమిండియా మాజీ సారథి ధోనీ రూటే సెపరేటు. సారథ్యంలో వైవిధ్యమే కాకుండా తను చేసే ప్రతి పనిలోనే ప్రత్యేకంగానే కనిపిస్తాడు. ప్రపంచ కప్‌లో భాగంగా మంగళవారం టీమిండియా- బంగ్లా మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ 40 ఓవర్లో ధోనీ బ్యాటింగ్‌ చేస్తుండగా బంగ్లా బౌలర్‌ సాబిర్‌ రహ్మాన్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. సాబిర్‌ బంతి వేస్తుండగా ధోనీ దాన్ని అడ్డుకున్నాడు. బంతి వేయద్దని చెప్పాడు. ఫీల్టింగ్‌ లైన్‌ను సరి చేసుకోవాలని సూచించాడు. క్రీజు వద్ద ఉన్న ఫీల్డర్‌..బౌలర్‌ చెప్పిన స్థానంలో కాకుండా కొంచెం ముందుకు జరిగాడు. దీన్ని గమనించిన ధోనీ ఫీల్డర్‌ను సరైన పొజిషన్‌లో ఉంచాలని కోరాడు. ధోనీ సలహా విన్న బంగ్లా బౌలర్‌ ఫీల్డర్‌ను వారించాడు. బంతి వేస్తుండగా ఆపడం, ప్రత్యర్థి జట్టుకు ధోనీ సలహాలివ్వడం, దాన్ని వాళ్లు పాటించడం వంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని మ్యాచ్‌ కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.

మెగాటోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో  ధోని (113; 78 బంతుల్లో 8×4, 7×6) కేఎల్‌ రాహుల్‌ (108; 99 బంతుల్లో 12×4, 4×6) మెరుపు శతకాలు బాదడంతో బంగ్లాపై టీమిండియా విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో టీమిండియా మ్యాచ్‌లు జూన్‌ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. కోహ్లీ సేన తొలి మ్యాచ్‌ సౌతాఫ్రికాతో ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: