దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొనేలా... ఘ‌న విజ‌యం సాధించి ఏపీ ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నానికి సాహసానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పుడు మొత్తం 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేయనున్న జగన్మోహన్ రెడ్డి... మరో రెండున్నరేళ్ల తర్వాత 20 మందిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు ప్ర‌క‌టించారు. తాజాగా జ‌రిగిన స‌మావేశంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు. మంత్రివర్గంలో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్‌ తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తాం. అప్పుడు కొత్త వారికి అవకాశం కల్పిస్తామని జగన్ తెలిపారు.


 తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో జ‌గ‌న్ మంత్రివ‌ర్గం స్పష్టత ఇచ్చారు.  వైసీఎల్పీ సమావేశానికి ముఖ్యమంత్రితో సహా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన‌ ఈ సమావేశంలో మంత్రివర్గంపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 మందితో రేపు పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అనంత‌రం వారిని మారుస్తామ‌ని కూడా తెలిపారు. అయితే, 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత ఏకంగా 20 మంది మంత్రులను ఒకేసారు మార్చడం అంటే చాలా సాహాసంతో కూడుకున్న పనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలిచింది.  మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇంత భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న జ‌గ‌న్ మంత్రుల‌ను మారుస్తాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి... వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వ‌డం అనేది మంత్రుల పనితీరును బట్టి ఉంటుందా..? లేకా ప్రతీ జిల్లా నుంచి కేబినెట్‌కు పోటీ తీవ్రంగా ఉండడతో రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: