జగన్ .. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తానని చెప్పి, శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న సంగతీ తెలిసిందే. అయితే విద్యుత్ ఒప్పందాలను రివ్యూ చేయాలని భావిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదిలోనే దారులు మూసుకుపోయాయి. అలా చేయడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వ శక్తి, వనరుల శాఖ స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, నీటి పారుదల, మౌలిక వసతులకు సంబంధించిన పలు టెండర్లను రద్దు చేయాలని సీఎం జగన్ భావించారు.


విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఒప్పందాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాలన్నింటినీ సమీక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా అడుగులు వేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ ఒప్పందాలన్నింటినీ సమీక్షించడానికి ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చర్యలు ప్రారంభించారు.


అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర శక్తి వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ దీనికి బదులిస్తూ.. ఆ ఒప్పందాలను మార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖ రాశారు. ‘ఏపీలో కొత్త ప్రభుత్వం ఒకవేళ విద్యుత్ ఒప్పందాలను మార్చాలని భావిస్తే.. దేశవ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. అదే జరిగితే శక్తి వనరులకు సంబంధించి దేశ ప్రాధాన్యాలు కూడా ప్రభావితం అవుతాయి.’ అని ఆనంద్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఈ పరిస్థితిని వివరించాలని సీఎస్ సుబ్రమణ్యంను కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: