రియల్ స్టార్ శ్రీహరి మరణం సగటు సినీ అభిమానిని ఆవేదనకు గురి చేసింది. ఆయనకు ఫ్యాన్స్ తో పని లేదు. ఆయన వ్యక్తిత్వం.. మంచితనం.. దానగుణం.. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తాను ఉన్నానంటూ ముందుకు దూసుకెళ్లే వైనం అందరినీ అలరిస్తాయి. చాలామంది యాక్టర్లు వెండితెర మీద హీరోలుగా
జీవిస్తుంటారు.

కానీ.. శ్రీహరి వారందరికీ భిన్నం. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ షేర్ ఖానే. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా కన్నుమూయటం అందరినీ బాధిస్తోంది. పుట్టింది కృష్ణా జిల్లాలో అయినా.. తర్వాత జీవితం అంతా హైదరాబాద్ లోనే. కేవలం ఆయన మంచితనం వల్లనేమో.. ఒక ప్రాంతం అంటే మరో ప్రాంతం వారు మండిపడే ప్రత్యేక పరిస్థితుల్లోనూ.. అటు సీమాంధ్రులు, ఇటు తెలంగాణవాదులు ఆయన్ని తమ వాడిగా భావిస్తున్నాయి. సీమాంధ్రులతో పోలిస్తే.. తెలంగాణ వారు.. శ్రీహరి తమ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటాయి.

ఇలాంటి వ్యక్తికి సంబంధించిన ఒక విషయాన్ని రాయటం కాస్త ఇబ్బందికరమే. కానీ.. ఈ విషయం నలుగురికి తెలియటం ద్వారా.. వేలాదిమంది ప్రాణాలను రక్షించే ఉద్దేశ్యంతో మాత్రమే దీన్ని రాస్తున్నాం. శ్రీహరి అనారోగ్యంతో మరణించారు. దానికి కారణం.. ఆయనకు ఉన్న ఒక్క చెడ్డ అలవాటు. నిజానికి చాలామంది మాదిరే దాన్ని ఆయన సీరియస్ గా తీసుకోలేదేమో. ఆయనకు గుట్కా నమిలే అలవాటు ఉంది. అది కూడా మోతాదుకు మించి గుట్కా తింటారని ఆయన సన్నిహితులు చెబుతారు. అదే ఆయన అనారోగ్యానికి మూలకారణంగా చెబుతారు. అయితే.. ఆయన ఆ విషయాన్ని గుర్తించేసరికే ఆరోగ్యం బాగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తారు.

ఒక మంచి మనిషి నాలుగు రోజులు ఎక్కువ బతికితే.. 400 మందికి లాభం. ఒక్క అలవాటు అలాంటి వ్యక్తిని అందనంత దూరానికి తీసుకెళితే.. అది లక్షలాది మందిని నష్టపరుస్తుంది. శ్రీహరిని నిజంగా అభిమానించే వారు చేయాల్సింది ఒక్కటే. గుట్కా..పాన్ మసాలా అలవాటు ఉన్న వారికి.. రియల్ హీరో ఉదంతం గురించి చెప్పి అయినా మాన్పించాలి. అదే ఆయన ఆత్మకు శాంతిని చేకూరుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

పీఎస్ – శోకతప్తంతో ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని వార్తగా రాయటానికి కారణం.. సంచలనం చేసేందుకు కాదు. కేవలం సామాజిక స్పృహను పెంచటం కోసం.. లక్షలాది మందిని హెచ్చరించటం కోసం మాత్రమేనని గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: