వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తొలి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వివిధ వ‌ర్గాలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా సినీ న‌టుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ త‌మ అభిప్రాయం తెలిపింది. 2019-2020 సంవ‌త్స‌రానికి గాను ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో అభివృద్దికి, సంక్షేమానికి మ‌ధ్య స‌మ‌తుల్య‌త కొర‌వ‌డింద‌ని జ‌న‌సేన పార్టీ అభిప్రాయపడింది. సంక్షేమ ప‌థ‌కాల కేటాయింపుల‌తో పాటు రాష్ట్ర ఆర్ధిక ప్ర‌గ‌తి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేస్తే బాగుండేద‌ని సూచించింది. ఎన్నిక‌ల హామీ న‌వ‌ర‌త్నాల అమ‌లుకు బ‌డ్జెట్‌లో కేటాయింపులు అయితే చేశారు గానీ, అందుకు అవ‌స‌ర‌మైన నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి అనే అంశంలోనూ స్ప‌ష్ట‌త కొరవడిందని తెలిపింది. 

 

 

జ‌న‌సేన సీనియ‌ర్ నేత, గ‌వ‌ర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిట‌రింగ్ క‌మిటీ చైర్మన్ చింత‌ల పార్థ‌సార‌ధి మీడియాతో మాట్లాడుతూ బ‌డ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్దికి మ‌ధ్య స‌మ‌తుల్యత లేదన్నారు. "ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడిగా భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ప్ర‌భుత్వం చెప్పిన విధంగా 2021 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా రూ. 32 వేల కోట్లు అవ‌స‌రం ఉంది. ఆ నిధులు ఎక్క‌డి నుంచి తీసుకువ‌స్తారు.?  కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్ని ఏ విధంగా తీసుకువ‌స్తారు.?  అనే అంశాల‌పై వైసిపి స‌ర్కారు స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే వివిధ కార‌ణాల‌తో కాంట్రాక్ట‌ర్లు వెన‌క్కి పోతున్నారు. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ సెటిల్‌మెంట్‌కి సంబంధించి స్ప‌ష్ట‌త లేదు. నిర్వాసితుల‌కి ఇప్పటి వ‌ర‌కు ఎంత ఇచ్చారు.? ఇంకా ఎంత ఇవ్వాలి.? కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎంత వ‌స్తుంది.? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకురావ‌డం కోసం మీ ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌ణాళిక‌లు ఏంటి.? త‌దిత‌ర అంశాల‌ను ప్రస్థావిస్తూ శ్వేత‌ప‌త్రం  విడుద‌ల చేయాల‌ని జ‌న‌సేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. మిగిలిన నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌కు కూడా అర‌కొర నిధులే కేటాయించారు. ` అని తెలిపారు.

 

సంక్షేమం అవ‌స‌ర‌మే అదే స‌మ‌యంలో రాష్ట్ర ఆర్ధిక పురోగ‌తి కూడా అవ‌స‌రమ‌ని జ‌న‌సేన నేత పేర్కొన్నారు. ``ఈ రెండింటికీ మ‌ధ్య సమ‌తుల్య‌త కూడా కావాలి. ఆర్ధికంగా పురోగ‌తి సాధిస్తేనే అభివృద్దిలో రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఆరోగ్య శ్రీ విష‌యానికి వ‌స్తే మ‌ధ్య‌త‌ర‌గతికి వ‌ర్తింప చేయ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. అయితే ఆరోగ్య శ్రీకి ఇచ్చే బ‌డ్జెట్‌లో అంతా ప్ర‌యివేటు ఆసుప‌త్రుల ప‌రం అవుతోంది. వేల కోట్లు ప్ర‌యివేటుకు దోచిపెట్టే బ‌దులు ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వైద్య సౌక‌ర్యాలు మెరుగుప‌రిస్తే బాగుంటుంది. జిల్లా స్థాయి ఆసుప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాలు మెరుగుప‌ర్చాలి. అవ‌స‌రం మేర‌కు డాక్ట‌ర్ల నియామ‌కం చేప‌ట్టాలి. వైద్య క‌ళాశాల‌ల‌ను  ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు అనుసంధానం చేస్తే మ‌రిన్ని క‌ళాశాల‌లకు అనుమ‌తులు తెచ్చుకునే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌భుత్వ రంగంలో వైద్యానికి మ‌రింత కేటాయింపులు చేస్తే బాగుండేది. ``అని పేర్కొన్నారు. 

 

సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద‌పీట అని పేర్కొంటూ రైతుల‌కు సున్నా వ‌డ్డీ రుణాలు ఇస్తామ‌న్నారని అయితే... ఆ సున్నా వ‌డ్డీ రుణాల‌కు కేటాయించింది రూ. 100 కోట్లేన‌ని జ‌న‌సేన త‌ప్పుప‌ట్టింది. ``మ‌న‌ది వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం. ప్ర‌స్తుతం తీవ్ర‌మైన క‌రువు ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. విత్త‌నాల కొర‌త‌. అలాంటి ప‌రిస్థితుల్లో రూ. 100 కోట్లు ఎలా స‌రిపోతాయి. సున్నా వ‌డ్డీ రుణాల‌కు క‌నీసం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే రైతుల‌కి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. బ‌డ్జెట్ ఆమోదానికి ముందు జ‌న‌సేన పార్టీ చేసిన ఈ సూచ‌న‌ను స్వీక‌రిస్తార‌ని ఆశిస్తున్నాం. ఓవ‌రాల్‌గా బ‌డ్జెట్ చూస్తే  ఆదాయం, వ్యయాల మ‌ధ్య భారీగా తేడా క‌న‌బ‌డుతోంది. గ‌త ప్ర‌భుత్వం కూడా కేంద్రం నుంచి రూ. 50 వేల కోట్లు తెస్తామ‌ని చెప్పింది. తీరా వ‌చ్చింది రూ. 20 వేల కోట్టు మాత్ర‌మే. బ‌డ్జెట్‌కి సంబంధించి ఏ విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి ఉన్న రాబ‌డి ఎంత‌, కేంద్రం నుంచి ఎంత వ‌స్తుంది. అప్పుల రూపంలో ఎంత తీసుకువ‌స్తున్నాం అనే అంశాల మ‌ధ్య స‌మ‌తుల్య‌త పాటిస్తేనే అభివృద్ది సాధ్యపడుతుంది. ప్రభుత్వ ఆసుప‌త్రులు, ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా స్వ‌యం స‌మృద్ది సాధించాలి. ఇది రాష్ట్రం మ‌రింత అభివృద్దిపధంలో ముందుకు వెళ్ల‌డానికి దోహ‌ద ప‌డుతుంది. జ‌న‌సేన పార్టీ చేసిన సూచ‌న‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దృష్టిలో పెట్టుకుని ప‌రిపాల‌న సాగించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు" శ్రీ పార్థసారధి తెలిపారు.

 

 

ప్ర‌భుత్వాలు మారిన ప్ర‌తిసారీ సంక్షేమ ప‌థ‌కాల పేర్లు మారిపోతున్నాయని జ‌న‌సేన నేత పేర్కొన్నారు. ``టీడీపీ హ‌యాంలో ఎన్టీఆర్ చంద్ర‌న్న ప‌థ‌కాలు అంటూ ఉద‌ర‌గొడితే, వైసిపి స‌ర్కారు అన్ని ప‌థ‌కాల‌కు వైఎస్ఆర్ పేరుని త‌గిలించింది. అధికారంలో ఉన్నవారు మాత్ర‌మే రాష్ట్ర అభివృద్ది కోసం త్యాగాలు చేశారా.?  దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం పాటుప‌డిన మ‌హ‌నీయులు ఉన్నారు. కొన్ని ప‌థ‌కాల‌కు అయినా ఆ త్యాగ మూర్తుల పేర్లు పెట్టాల‌ని జ‌న‌సేన పార్టీ  విజ్ఞ‌ప్తి చేస్తోంది.`` అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: