ముఖ్యమంత్రి   వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరిదీ ఉప్పు, నిప్పు వ్యవహారమే. ఆయన ఎడ్డెమంటే ఈయన తెడ్డేమంటాడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇద్దరు నాయకులూ ఆవేశ కావేశాలను టీవీల సాక్షిగా ఏపీ  జనం చూశారు. ఎవరూ తగ్గని వాతావరణం కనిపించింది. ఈ ఇద్దరు నాయకులు ఉంటే చాలు వేడి అదే పుట్టేస్తుంది.


ఇదిలా ఉండగా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల దాక సభలో ఈ ఇద్దరు నేతలూ కనిపించే అవకాశాలు లేవు. చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు నిన్నటితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కి నమస్కారం పెట్టేసి ఆయన సభకు సెలవ్ అనేశారు. చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబద్ వచ్చేశారు కూడా.


ఆయన అమెరికా టూర్  రేపు పెట్టుకున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి ఆగస్ట్ 1న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అంటే ఈ నెల 29, 30 తేదేలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు అందుబాటులో ఉండరన్న మాట. బడ్జెట్ సెషన్ 30తో పూర్తి అవుతుంది.


ఇక మరో వైపు జగన్ కూడా విదేశీ టూర్ పెట్టుకున్నారు. ఆయన ఆగస్ట్ 1న జెరూసలెం వెళ్తారని అధికార వర్గాల సమాచారం . ఈ  పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ లోని క్రైస్తవ పవిత్ర స్థలాలతో పాటు క్రీస్తు జన్మస్థలం బెత్లహాంను సైతం సీఎం జగన్ సందర్శిస్తారు. జగన్ కుటుంబం జెరూసలెం టూర్ ప్రతీ ఏడాది వెళ్తుంది. అది వైఎస్ కాలం నుంచి ఆచారంగా వస్తోంది. ఇపుడు తొలిసారి సీఎం హోదాలో జగన్ వెళ్తున్నారు.


ఇదిలా ఉండగా చంద్రబాబు  జులై 28 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు అమెరికా టూర్లో ఉంటే, జగన్ ఆగస్ట్ 1 నుంచి 4 వరకు జగన్ రాష్ట్రంలో ఉండరు. అంటే బాబు విదేశాల నుంచి స్వదేశం వచ్చిన రోజునే జగన్ విదేశీ యాత్ర మొదలవుతుందన్న మాట. జగన్ ఆగస్ట్ 4న తిరిగి అమరావతి చేరుకుంటారు. విదేశీ టూర్లలో సైతం ఇద్దరు నేతలూ పోటీ పడడం ఇపుడు కొత్త టాపిక్ గా  ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: