తెలుగు రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టిన బీజేపీ ఇందులో స్పెష‌ల్ ఫోక‌స్‌ను తెలంగాణ‌పై పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక రాష్ట్రంలో వికసించేందుకు కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల్లోని నాయకులనూ, యువతనూ ఆకర్షించే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇందుకు కొత్త స‌భ్యత్వాల‌ను ఎంత నమ్ముకుంటున్నారో...ప్ర‌ముఖ నేత‌ల‌కు గాలం వేసే ప‌నిలోనూ ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు షాకిచ్చేందుకు అమిత్‌షా ఎంచుకున్న అస్త్రం...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఒక‌నాటి న‌మ్మిన‌బంటును ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


బీజేపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, టీఆర్ఎస్ ఆప‌రేష‌న్‌తో తెలుగుదేశం పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు అవ‌డంతో ప‌లువురు ముఖ్య‌లు తెలంగాణ‌లో కాంగ్రెస్‌లో చేర‌గా మిగిలిన నేత‌లు స‌రైన వేదిక కోసం చూస్తున్నారు. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆ పార్టీ కేడర్‌ మొత్తాన్ని తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ముందుగా వివిధ జిల్లాల్లోని నియోజకవర్గ స్థాయి నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.బీజేపీలో చేరిన టీడీపీ నేత గరికపాటి రామ్మోహన్‌రావు నేతృత్వంలో టార్గెట్‌ టీడీపీని కొనసాగిస్తున్నట్లు సమాచారం. 


టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఆప్తుడ‌నే పేరున్న గ‌రిక‌పాటికి తెలుగుదేశం పార్టీ నేత‌ల గుట్టుమ‌ట్టులు...బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌న్నీ తెలుస‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. కీల‌క స‌మాచారాన్ని గ‌రిక‌పాటితో సేక‌రించి పార్టీ ముఖ్యులు రాంమాధ‌వ్‌, ముర‌ళీధ‌ర్‌రావు త‌దిత‌రుల‌తో త‌దుప‌రి ప్ర‌క్రియ‌లు మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు చెప్తున్నారు. మొత్తంగా ఈనెల‌లోనే పెద్ద ఎత్తున నేత‌ల‌ను బీజేపీలో చేర్పించి కాషాయ పార్టీ స‌త్తా చాటేందుకు కేసీఆర్‌కు త‌మ బ‌లం చూపేందుకు అమిత్‌షా సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. తెలంగాణలోనే క్రియాశీల సభ్యత్వం తీసుకోబోతున్నారు. రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్‌లో ఆయన బీజేపీ సభ్యత్వం తీసుకోనుండ‌టం అమిత్‌షా స్పెష‌ల్ ఫోక‌స్‌కు తార్కార‌ణ‌మ‌ని ప‌లువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: