వైసీపీ సర్కార్ ప్రధమ ప్రాధాన్యత పొదుపు. ప్రతి విషయంలోనూ రూపాయి పోగు చేసి ప్రజలకు మేలైన సేవలు అందించాలన్నది జగన్ ఆశయం. ఆ విధంగానే ఆయన గత రెండు నెలలల పాలనలో చెప్పుకొస్తున్నారు. అయితే  చెప్పేదానికి, చేసేదానికి కొంతైనా ఏమైనా ఉందా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయట. జగన్ పొదుపు మంత్రం పఠిస్తుంటే మరి ఆయన పధకాల సంగతేంటన్న  ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.


పౌర సరఫరాల శాఖలో ఇపుడు వందల కోట్ల అదనపు ఖర్చు పడుతోంది. అది కూడా  సంచులలో రేషన్  బియ్యం సరఫరా కోసమట. అయిదు కిలోల బియ్యం  సంచికి తొమ్మిది రూపాయలు, పది కిలోలకు పన్నెండు రూపాయలు, 20 కిలోల సంచికి 14 రూపాయలు ధరలు నిర్ణయించారు. అంటే ఈ బియ్యం  కిలో ధర రూపాయి అయితే దానికన్నా సంచీల ఖర్చే ఎక్కువగా ఉంటోందన్న మాట. 


ఈ మొత్తం సంచీల ఖర్చు చూస్తే ఏడాదికి 750 కోట్ల రూపాయల భారం పడుతోందని అంటున్నారు. ఏపీలోని 13 జిల్లాలలో మొత్తం ఒక కోటీ 47 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారిని నెలకు 20 కోట్లకు పైగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలి. గతంలో అయితే కేవలం డీలర్ల షాపులకు మాత్రమే సరకు తరలించేందుకు రవాణా ఖర్చులు అయ్యేవి.


ఇపుడు వైసీపీ డోర్ డెలివరీ కార్యక్రమం పెట్టడంతో పాటు, ఈ సంచులను కూడా కొత్తగా  ప్రవేశపెట్టడంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోందని అంటున్నారు. ఇన్ని లక్షల మందికి డోర్ డెలివరీ చేయాలంటే నెలకు 2.07 కోట్ల  సంచులు అవసరం. అందులో అయిదు కేజీల సంచులు 74 లక్షలు, 10 కేజీల సంచులు 73 లక్షలు, 20 కేజీల సంచులు 60 లక్షలు అవసరం అవుతున్నాయి. 


అంటే ఒక్క సంచుల ఖర్చే నెలకు 8.4 కోట్ల రూపాయలు అవుతాయన్నమాట. ఇలా 12 నెలలకు 286.32 కోట్లు ఖర్చుగా లెక్క తేల్చారు. అలాగే ఇవి కాకుండా బఫర్ గోదాములకు తరలించేందుకు 50 కిలోల సంచులు కూడా తయారు చేయాల్సిఉందిట. వాటితో పాటే ప్యాకింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలి. ఈ యంత్రాల నిర్వహణ, ఇతర వ్యయాలు మొత్తం కలిపితే ఏడాదికి 750 కోట్ల రూపాయల పెను భారం ప్రజలపై పడుతోంది.


ఈ అనవసరపు ఖర్చు బదులు ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తే  పేదలు జగన్ పేరు చెప్పుకుంటారని అంటున్నారు. మొదట సన్న బియ్యం ఇస్తామని చెప్పిన జగన్ సర్కార్ ఇపుడు  దానికి అదనంగా వేయి కోట్ల మొత్తం అవుతుందని వెనక్కి తగ్గింది. మరి జనం ఎటూ డోర్ డెలివరీ కోరుకోవడం లేదు కాబట్టి ఆ పని చేస్తే మేలేమో. జగన్ ఆలోచిస్తే బెటర్.



మరింత సమాచారం తెలుసుకోండి: