చూడబోతే తొందరలోనే బిజెపిలో జనసేన విలీనం అయిపోయేట్లే కనిపిస్తోంది. విలీనం చేయనని పవన్ కల్యాణ్ ఎంత గట్టిగా చెబుతున్నా ఆ మాటలను ఎవరూ నమ్మటం లేదు. అందుకు పవన్ కున్న ట్రాక్ రికార్డు అలాంటిది మరి. పైగా తమతో కలిసి పనిచేయమని జాతీయ పార్టీలు ఆహ్వానిస్తున్నట్లు పవన్ చెప్పుకున్నారు. పవన్ ను ఆహ్వానించే జాతీయ పార్టీ ఏమిటో ఎవరికి అర్ధం కావటం లేదు.

 

పవన్ ఆహ్వానించటమంటే సదరు జాతీయపార్టీకి ఏపితో సంబంధాలుండాలి కదా ? అలాంటి పార్టీ ప్రస్తుతానికి బిజెపి ఒక్కటే కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బిఎస్పీతో కలిసే పోటీ చేశారు. అంటే ఇప్పటికే బిఎస్పీతో జనసేనకు పొత్తు ఉన్నట్లే. ఇక మిగిలింది బిజెపి ఒక్కటే.

 

కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ప్రశక్తే ఉండదు దాదాపుగా. టిడిపి కూడా జాతీయ పార్టీనే అంటే మొన్న డబుల్ గేమ్ ఆడటంతోనే జనాలు గుండుకొట్టారు. కాబట్టి ఇప్పటికప్పుడు చంద్రబాబుతో కలిసినా వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. సో, ఎటునుండి ఎటు చూసుకున్నా బిజెపితో కలిసేందుకే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎలాగూ 2014లో కలిసే పనిచేశారు కాబట్టి కొత్తగా వచ్చే ఇబ్బందేమీ ఉండదు.

 

బిజెపి విషయం చూస్తే ఆ పార్టీకి జానకర్షణ కలిగిన నేత చాలా అవసరం. కొద్దో గొప్పో క్షేత్రస్ధాయిలో జనసేనకన్నా బిజెపికే కార్యకర్తలు, నేతల బలముంది. అందులోను ఈమధ్య భారీగా సభ్యత్వ నమోదు కూడా చేస్తున్నారు. పార్టీని నడిపించేంత సీన్ పవన్ కు ఎప్పుడో తేలిపోయింది.  కాబట్టి బిజెపికున్న సంస్ధాగత, నాయకత్వ బలానికి పవన్ ఆకర్షణ శక్తి తోడైతే బ్రహ్మాండంగా ఉంటుందని కమలం పార్టీ నేతలు అనుకుంటున్నారు.

 

కాబట్టి ఏదో ఓ మాయ చేసి జనసేనను తమలో కమలం పార్టీ కలిపేసుకోవటం ఖాయం. పైగా పార్టీకి  నిధుల సమస్య కూడా లేదు. కాబట్టి పవన్ కు కీలక పదవిని కట్టబెడితే జనసేనను కలిపేసుకోవటమే మేలని కమలనాధులు అనుకుంటున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: