ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా సాగుతున్న ప‌రిణామాల‌తో ఢిల్లీలో జ‌మ్ముక‌శ్మీర్‌ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం, ఇదే స‌మ‌యంలో విప‌క్ష నేతలు భేటీ, ఆ త‌దుప‌రి పార్ల‌మెంటు స‌మావేశాలు, ఎంపీల ఆందోళ‌న‌తో సీన్ వేడెక్కుతోంది. కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.  అనంత‌రం లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న మోదీ నివాసంలో కేంద్ర మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, రక్షణశాఖ అధికారులతో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.


కాగా, ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంటు ప్ర‌తిప‌క్షాలు స‌మావేశ‌మ‌య్యాయి. అనంత‌రం క‌శ్మీర్‌కు చెందిన వ్య‌క్తి కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.  జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని మండిప‌డ్డారు. ``ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రస్తుతం ముగ్గురు మాజీ సీఎంలను గృహ నిర్బంధం ఎందుకు చేశారు? నిన్న మొన్నటి వరకు కశ్మీర్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరకు అన్ని ఎన్నికలు సజావుగా జరిగాయి. కశ్మీర్‌కు వచ్చిన పర్యాటకులు ప్రశాంతంగానే ఉన్నారు. ఒక్కసారిగా కశ్మీర్‌లో పరిస్థితులను అల్లకల్లోలం చేశారు.``  అని ఆజాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ఇదిలాఉండ‌గా,  పార్లమెంట్ ఆవరణలో జమ్ముకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ రాజ్యసభ సభ్యులు నజీర్ అహ్మద్ లేయర్, మిర్ మహ్మద్ ఫయాజ్‌లు కశ్మీర్ పరిస్థితులపై నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన ఎంపీలుకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నారని, మిలటరీని వెనక్కు రప్పించాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం నిశితంగా ప‌రిశీలిస్తోంది. 
ఇదిలాఉండ‌గా, జమ్మూకశ్మీర్ అంశంపై కేంద్రం అడుగులు మారుతున్న నేప‌థ్యంలో.... ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో 144 సెక్షన్‌ను విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మ‌రోవైపు  దేశంలోని అన్ని రాష్ర్టాలకు హైఅలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. దేశంలోని సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ర్టాల పోలీసులకు కేంద్ర హోంశాఖ సూచించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: