దేశంలో ఇప్పుడు చ‌ర్చ అంతా..జమ్ముక‌శ్మీర్ గురించే. ఆ రాష్ట్రం కేంద్రంగా మారుతున్న ప‌రిణామాల గురించే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు, ఆర్టికల్ 35ఏ రద్దుకు కూడా ప్రతిపాదన చేస్తూ రాజ్యసభలో ప్రకటన చేశారు. దీంతో...అస‌లు ఏంటి ఆర్టిక‌ల్‌లు అని చ‌ర్చ న‌డుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే..ఆర్టిక‌ల్ 370 అనేక ప్ర‌త్యేక‌త‌లు క‌లిగి ఉన్న‌ది. స్వాతంత్ర్యం స‌మ‌యంలో రాజా హరిసింగ్‌, నెహ్రూ ఆదేశాల ప్రకారం..1947లో షేక్‌ అబ్దుల్లా ఈ ఆర్టికల్‌ ముసాయిదాను తయారు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ రాష్ర్టానికి ఈ ఆర్టికల్‌ స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ పార్ట్‌లో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్‌ 370 కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు. దేశంలోని మిగితా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు. 


ఆర్టికల్‌ 370 ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగితా చట్టాల అమలు కోసం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం ఓకే అంటేనే.. అప్పుడు పార్లమెంట్‌ మిగితా చట్టాలను అమలు చేస్తుంది. అంటే ఈ ఆర్టికల్‌ ప్రకారం.. కశ్మీర్‌ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తారరు. పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్‌షిప్‌, ప్రాథమిక హక్కులు కూడా కశ్మీర్‌కు భిన్నంగా ఉంటాయి. దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్‌లో స్థిరాస్తులు కొనే అవకాశం ఉండదు. ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. 


ఆర్టికల్‌ 35ఏ మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌లు క‌లిగి ఉన్న‌ది.  జమ్మూకశ్మీర్‌ కోసం ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. కశ్మీర్‌లో ఎవరు శాశ్వత నివాసితులో తేల్చేందుకు ఆర్టికల్‌ 35ఏను తీసుకొచ్చారు. కశ్మీర్‌లోని పర్మనెంట్‌ రెసిడెంట్స్‌కు ప్రత్యేక హక్కులను కూడా ఈ ఆర్టికల్‌ కల్పిస్తుంది. ఈ అధికరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతుంది. స్థిరాస్థి కొనుగోలు కూడా జరుగాయి. ప్రజాసంక్షేమ పథకాల అమలు కూడా జరుగుతుంది. 1954లో ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370(1) (డీ) ప్రకారం కశ్మీర్‌ అంశంపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర అంశంలో ఎవరైనా మార్పులు చేయాలంటే.. రాష్ట్రపతికి ప్రత్యేక హక్కులు కల్పించారు. అయితే ఆర్టికల్‌ 35ఏ అక్రమపద్ధతిలో రాజ్యాంగంలో పొందుపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టికల్‌ 370 ద్వారా.. ఆర్టికల్‌ 35ఏ లాంటి కొత్త అధికరణలను తీసుకురావడం సరికాదు అని కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. 35ఏ ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలకు కశ్మీర్‌లో ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ప్రాపర్టీని ఖరీదు చేయకుండా నిలువరించడం.. రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణలను ఉల్లంఘించినట్లు అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: