నరేంద్ర మోదీ - అమిత్ షా నేతృత్వంలోని  ప్రభుత్వం  తీసుకున్న  ఈ ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం మొత్తానికి జమ్మూ కశ్మీర్‌ లోనే కాకుండా అటు పాకిస్థాన్ లోనూ   ఇటు స్వదేశంలోనూ భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ నిర్ణయం గొప్పదని,  జమ్మూ కశ్మీర్‌ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేస్తోందని  ఒక పక్క మోదీ ద్వయం పై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మోదీ - అమిత్ షా తీవ్రమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని.. దీని కారణంగా జమ్మూ కశ్మీర్‌ లో ప్రజలు అష్టకష్టాలు పడబోతున్నారని.. మోదీ రాజకీయ జీవితంలోనే ఇది చీకటి రోజు అని.. ఆయన జీవితానికే మాయని మచ్చ అని మరో పక్క  అటు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.  మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పై అటు పాకిస్తాన్ కూడా ఆవేశంగానే స్పందించింది. పాక్ విదేశాంగ వ్యవహారాల శాఖ స్పందిస్తూ..   కశ్మీర్ వివాద పరిష్కారం పై  తమకూ ప్రత్యక్ష  సంబంధం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలని..  మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ  అక్రమ విధానాలను తిప్పికొట్టేందుకు.. ఆచరించాల్సిన అన్ని అవకాశాల పై ఇప్పటికే తామూ  దృష్టి సారించినట్లు పాక్ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది.  పైగా కశ్మీర్  ప్రజలకు తాము అండగా ఉంటామని పాకిస్తాన్ బుకాయింపు మాటలు కూడా చెప్పుకొచ్చింది.  


ఏదయితే ఏమి.. మోదీ ద్వయం మాత్రం ఈ నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవాలని చూసిన.. అవి ఆలోచనలకి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ అమిత్‌ షా నిర్ణయం ప్రకటించి ఆచరించేలా చేయగలిగారు.  ఈ నిర్ణయం పూర్తిగా అమిత్ షా ఆలోచన మాత్రమే అని తెలుస్తోంది.   మోదీ సపోర్ట్ ఉన్నా.. కేవలం అమిత్ షా వ్యూహాలతోనే ఆర్టికల్‌  370 రద్దు అయిందట. హోంశాఖ బాధ్యతలు తీసుకోగానే అమిత్‌ షా జమ్ము-కశ్మీర్‌లోని ఆర్టికల్‌  370 పై ప్రత్యేక దృష్టి పెట్టారని..  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  స్వతహాగా రాజకీయ ఎత్తులు వేయడంలో  ఎంతటి కఠినమైన పనినైనా సాధించడంలో షాకి అపారమైన అనుభవం ఉంది. అందుకే   ఆర్టికల్‌  370 రద్దు  విషయంలో  కొన్ని నెలలు నుంచే  గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నప్పటికీ.. చివరి నిముషంలో  సభలో ప్రతిపాదన ప్రవేశపెట్టేటప్పుడు కూడా  ఈ నిర్ణయం గురించి ఎవరికీ తెలియకుండా తెలివిగా ప్రకటించేసి..  ఆ ప్రకటనకు  వెంటనే రాష్ట్రపతి నుంచి  ఆదేశాలు జారీ చేయించుకోవడం వరకూ ప్రతిదీ ఎంతో పక్కా వ్యూహంతోనే మోదీ - షాలు పని చేశారట.  

 

మొత్తానికి జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేసేశారు. లడఖ్‌ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించేశారు. పైగా లడఖ్‌ విషయంలో అక్కడి ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని  అమిత్‌ షా చెప్పడం విశేషం. అనుకున్న  పని అయితే విజయవంతం అయింది గాని..  జమ్మూ కశ్మీర్‌ మరియు పాక్ నుండి వస్తోన్న  విమర్శలకు  ఈ ద్వయం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: