ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా..? అంటే రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి అవున‌నే స‌మాధానం విన‌వ‌స్తుంది. అయితే నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతికి గుండెకాయ లాంటి కృష్ణ‌ప‌ట్నం పోర్టులో 70 శాతం వాటాను అదాని గ్రూప్ కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు ఇంకా తుది ద‌శ‌లోనే ఉన్నాయ‌ని అదాని గ్రూప్ తాజాగా వెల్ల‌డించింది.కాగా, వైఎస్ జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత ప్ర‌ధాని మోడీతో జ‌రిగిన మొట్ట మొద‌టి భేటీలో ఏపీ పున‌ర్విభ‌జ‌న బిల్లును ప్ర‌స్తావ‌న‌కు తీసుకొచ్చారు. ఆ బిల్లులో పేర్కొన్న‌ట్టుగా రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం జ‌గ‌న్ మోడీని కోరారు.


ఆ వెనువెంట‌నే న‌వ‌యుగ కంపెనీ త‌మ ఒప్పంద విష‌య‌మై అదాని గ్రూప్‌తో చ‌ర్చ‌ల‌ను వేగ‌వంతం చేసింది.అయితే,  సీఎం జ‌గ‌న్ వెంట‌నే నిర్మించాల‌ని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న రామాయ‌ప‌ట్నం పోర్టు.. అదాని గ్రూప్ 70 శాతం వాటాను చేజిక్కించుకోవాల‌ని చూస్తున్న కృష్ణ‌ప‌ట్నం పోర్టుపై ప‌లువురి విశ్లేష‌ణ‌లు ఇలా ఉన్నాయి. రెండు పోర్టులు కూడా ద‌రిదాపు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గానే ఉంటాయ‌ని, దీంతో రామ‌య‌ప‌ట్నం పోర్టు నిర్మిత‌మైతే రెవెన్యూ ప‌రంగా కృష్ణ‌ప‌ట్నం పోర్టుపై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు పేర్కొంటున్నారు.


కృష్ణ‌ప‌ట్నం పోర్టులో అత్య‌ధిక‌శాతం వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేస్తే రామాయ‌ప‌ట్నం పోర్టును నిర్మించాలంటూ సీఎం జ‌గ‌న్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.దేశ వ్యాప్తంగా త‌మ పారిశ్రామిక వ్యాపార లావాదేవీల‌ను విస్తృతం చేసిన అదాని గ్రూప్ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి అత్యంత స‌న్నిహితంగా ఉంటుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ప్ర‌ధాని మోడీకి కూడా. ఆ ప‌లుకుబ‌డితోనే కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు ద‌గ్గ‌ర‌గా ఏ పోర్టు నిర్మించాల‌ని నిర్ణ‌యించినా దాన్ని అడ్డుకునేందుకు వెనుకాడ‌ర‌న్న ప్ర‌చార‌మూ ఉంది.


అది దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు కానీ, రామ‌య‌ప‌ట్నం పోర్టు కానీ.ఇదే స‌మ‌యంలో న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హ‌యాంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను గుర్తు చేస్తూ.. నాడే రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని కిర‌ణ్ కుమార్‌రెడ్డి కోరార‌ని, కానీ కిర‌ణ్ కుమార్‌రెడ్డి ప్ర‌తిపాద‌న‌ల్లో రామాయ‌ప‌ట్నం వ‌ద్ద పోర్టు నిర్మాణం జ‌ర‌పాలంటూ పేర్కొంటే.. అక్క‌డ వ‌ద్దు దుగ‌రాజ‌ప‌ట్నం వ‌ద్ద నిర్మిద్దాం. స్థ‌ల ప‌రిశీల‌న కోసం క‌మిటీ కూడా వేస్తున్నామంటూ ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న పెట్టేశారంటూ ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు వారి అభిప్రాయాల‌ను చెబుతున్నారు. తాజా స‌మాచారం మేర‌కు కృష్ణ‌ప‌ట్నం పోర్టును అదానీ గ్రూప్ కొనుగోలు చేసినా ప్ర‌స్తుతం ఉన్న మేనేజ్‌మెంట్ పోర్టు నిర్వ‌హ‌ణ‌ను చూసుకోనుంది. ఇలా ఆదాని గ్రూప్ ఎంట్రీతో రామ‌య‌ప‌ట్నం పోర్టు నిర్మించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు రూపొందించిన జ‌గ‌న్‌కు ఊహించ‌ని షాకేన‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: