కమలంపార్టీ నేతలు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే పార్టీ నేతల్లో స్పష్టమైన చీలిక ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఒక వర్గమేమో బయటకు ఎలాగున్నా అంతర్గతంగా మాత్రం చంద్రబాబునాయుడుకు మద్దతు పలుకుతున్నారనే అనుమానం కలుగుతోంది. ఇక రెండో వర్గం మాత్రం పూర్తిగా అవుట్ అండ్ అవుట్ చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

 

పార్టీ నేతల ఆలోచన ఎన్నికలకు ముందు వరకూ ఒకే విధంగా ఉన్నా ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం తర్వాత మాత్రం తేడా కొడుతోందనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్లే టిడిపి నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించటంతో చీలిక స్పష్టంగా కనబడుతోంది.

 

నలుగురు ఫిరాయింపు ఎంపిల్లో ముగ్గురు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, సిఎం రమేష్ చంద్రబాబుకు బినామీలుగా ప్రచారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే వాళ్ళు బిజెపిలో చేరిన తర్వాత కూడా చంద్రన్నకు మద్దతుగానే మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు బిజెపిలో చేరిందే చంద్రబాబు రక్షణ కోసమనే టాక్ కూడా ఉంది లేండి.

 

ఎంఎల్సీ సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు అండ్ కో ఏమో చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని లూటి చేసిన చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అండ్ కో మాత్రం చంద్రబాబు మీద గొంతులు తగ్గించారు. అదే సమయంలో జగన్ కు వ్యతిరేకంగా తమ గొంతును బాగా పెంచుతున్నారు.

 

కన్నా వర్గం మాటలు వింటుంటే ఫిరాయింపు ఎంపిలతో కలిసిపోయారా అన్న అనుమానాలే బిజెపిలోని తటస్తులకు ఎదురవుతోందట. ఎందుకంటే ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబుపై ప్రతిరోజు ఆరోపణలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కన్నా వర్గం తాజాగా తమ గొంతులను సవరించుకుంటోంది. విచిత్రమేమిటంటే జాతీయ నాయకత్వం మాత్రం రెండు వర్గాలను ఒకేలా ఆధరిస్తోంది. దాంతో ఎవరి మాట చెల్లుబాటవుతుందో, తామెవరిని ఫాలో అవ్వాలో తెలీక తటస్తులు బుర్రలు గోక్కుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: