ఏపీలో మూడు నెలల వైసీపీ సర్కార్ మీద టీడీపీ నిత్యం ఏదో రూపంలో విరుచుకుపడుతోంది. గత అయిదేళ్ల పాపాలన్నీ కూడా వైసీపీకి తగిలించి విమర్శలు చేస్తోంది. అప్పు ఇవ్వకే పోవాలి కానీ ప్రతీ వారి దగ్గర వందల వేల కోట్ల అప్పు తెచ్చేసి అయిదేళ్ళలో జల్సా చేసిన పసుపు పార్టీ నవ్యాంధ్రను కుదేలు చేసేసింది. ఏ విధమైన ప్లాన్ లేకుండా తెచ్చిన అప్పులకు వడ్డీలు పెను భారమై కూర్చున్న వేళ ఇంకా తమ్ముళ్ళు కొత్త సర్కార్ మీద రాళ్ళు రువ్వుతున్నారంటే అది రాజకీయ దివాళాకోరుతనమేనని అంటున్నారు.


ఏపీలో టీడీపీకి ఇక నో చాన్స్ అనేస్తున్నారు రాజకీయ పండితులు. జగన్ పరిపాలన మూడు నెలల్లో ఏమీ చెప్పలేమని కూడా అంటున్నారు. కొత్త ప్రభుత్వం పాలనా తీరును అంచనా వేయడానికి కనీసం ఏడాది అయినా వ్యవధి ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. ఏపీకి సంబంధించి చూస్తే కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా పాలనాపరంగా కొత్త. అందువల్ల కేవలం మూడు నెలల్లో అద్భుతాలు చేయడం అంటే అది ఎవరికీ సాధ్యం కాదని కూడా అంటున్నారు.


ఇక జగన్ సీఎం గా బాబుకు విభిన్నమైన పంధాలో వెళ్తున్నారని, వాటి ఫలితాలు వచ్చేసరికి చాలా సమయం పడుతుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ వర్తమాన రాజకీయాలకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తున్నారని కూడా వారు అంటున్నారు. దేశంలో ఒక్క బీహార్లో తప్ప మధ్య నిషేధం ఎక్కడా  అమలు కావడం లేదు. దాన్ని ఏపీలో  జగన్ చేస్తామని అంటున్నారు. ఇక నవరత్నాల పేరు మీద అనేక కార్యక్రమాలు కూడా తలకెత్తుకున్నారు.


అదే విధంగా చూసుకుంటే అవినీతి రహిత పాలన, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ కూడా జగన్ లోని  కొత్త పాలకున్ని, విప్లవాత్మకమైన ఆలోచనలను బయటకు తెస్తున్నాయని చెబుతున్నారు. ట్రెడిషనల్ అడ్మినిస్ట్రేషన్ కి భిన్నగా సాగుతున్న జగన్ పాలన రాజకీయ పార్టీలకు అర్ధమైనా  కూడా జనాలను గందరగోళంలో పెట్టేందుకు వురికే  విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.


మహాత్ముడు  చెప్పినట్లుగా గ్రామాల్లోనే పాలన తీసుకురావడం అన్నది గ్రామ సచివాలయల ద్వారా  శ్రీకారం చుట్టిన జగన్ గొప్ప సంస్కరణవాది అని అంటున్న వారూ ఉన్నారు. ఇక మూడు నెలల వ్యవధిలో లక్షలాది ఉద్యోగాలు కూడా ఇవ్వడం గొప్ప నిర్ణయమని అంటున్నారు. అదే సమయంలో అవినీతి లేని పారదర్శక పాలనకు జగన్ రెడీ అవడాన్ని కూడా రాజకీయ మేధావులు పరిశీలిస్తున్నారు.


ఇక రివర్స్ టెండరింగ్ విధానం మీద జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవారికి మింగుడు పడకపోయినా రానున్న రోజుల్లో అవినీతి పోయేందుకు అది ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని అనే వారు ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాల ఫలితాలు కనుక పాజిటివ్ గా వచ్చేందుకే ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కనుక జరిగింతే ఏపీలొ టీడీపీ తలుపులు శాశ్వతంగా బంద్ అవడం ఖాయమని అంటున్నారు.


ఈ విషయాలు తెలిసే ఇప్పటి నుంచే జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత పోగు చేసేందుకు చంద్రబాబు అండ్ కో తంటాలు పడుతున్న వైనాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా అసలైన లబ్దిదారులు ప్రజలు కాబట్టి వారి రియాక్షన్ జగన్ కి అనుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుందని కూడా చెబుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: