ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఆర్థిక మాంద్యంపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు, బ్రోకరేజీలు దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ఆందోళన చెందుతున్నాయా?.. వాస్తవ పరిస్థితులు ఇంత భయంకరంగా లేవా?.. ప్రస్తుత ఆర్థిక మందగమనం కొన్ని కీలక రంగాల్లో కొనసాగుతున్న పరిణామమేనా?.. అంటే అవునని అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఎస్బీఐ నివేదిక సైతం ఈ మాంద్యాన్ని దాదాపు అలాగే అభివర్ణిస్తుండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో దిగజారిన కొనుగోళ్ల శక్తి మందగమనానికి బలాన్నిస్తున్నదన్న ఎస్బీఐ.. ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో ఆటో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని, ఆ ప్రభావం భారత్‌పైనా పడి ఉండవచ్చని వ్యాఖ్యానిస్తున్నది.


ఎఫ్‌ఎంసీజీ రంగంలో చోటుచేసుకున్న మందగమన ఛాయల్నీ.. అంతకుముందు ఎక్కువగా నమోదైన వృద్ధితో పోల్చడం వల్లేనని, చిన్నచిన్న సంస్థల ఉత్పత్తులకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటంతో భారీ సంస్థల ఆదాయం పడిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే వృద్ధికి దోహదం చేసే 33 సూచీల్లో 17 బాగున్నాయని మార్చిలో కనిపిస్తే.. జూన్‌లో ఇవి 9కి తగ్గుముఖం పట్టాయని ఎస్బీఐ చెప్పడం గమనార్హం. ఇక కేంద్రానికి ప్రిన్సిపల్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న సంజీవ్‌ సన్యాల్‌.. ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా చూడవద్దని, 2008 లేమన్‌ బ్రదర్స్‌ సంక్షోభం స్థాయిది కాదని అన్నారు.


కాగా, ప్ర‌స్తుత మాంద్యం గురించి 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. 2008లో మాంద్యం ప్రభావం కూడా 8 నెలలే అవగా.. ఇప్పుడు తలెత్తినది మాత్రం 18 నెలలుగా కొనసాగుతున్నది. 2008 జూన్‌ నుంచి 2009 జనవరి వరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ చిగురుటాకులా వణికిపోయింది. కానీ గతేడాది జనవరిలో మొదలైన ఈ ఆర్థిక మందగమన పరిస్థితులు.. చాప కింద నీరులా విస్తరిస్తూ, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గడ్డు పరిస్థితులకు అంతం ఎప్పుడన్నది తెలియకుండగా, ఇప్పట్లో మాత్రం భారత ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం లభించబోదని దేశ, విదేశీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతుండటం తాజా సంక్షోభం తీవ్రతకు అద్దం పడుతున్నది. 2008 మాంద్యం ప్రభావం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరో రెండు పర్యాయాలు కనిపించగా, 2011 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు, 2012 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌దాకా దాని దుష్పరిణామాలు ఉన్నాయి. చివరకు దేశ చరిత్రలోనే సంచలన ఆర్థిక సంస్కరణగా చెప్పుకుంటున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా నాలుగు నెలలే భారత ఆర్థిక వ్యవస్థను బాధించింది. కానీ ఇప్పుడున్న ఆర్థిక మందగమనం.. అన్ని రంగాలనూ కుదేలు చేస్తూ దేశ వృద్ధిరేటును మింగేస్తున్నదని ప్రముఖ గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంటున్నది. వినియోగ సామర్థ్యం తీవ్రంగా బలహీనపడిందని, దీనివల్ల ఆటో, నిర్మాణ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు దారుణంగా పడిపోయాయని చెబుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: