ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలో పనిచేసే వారికి డబ్బులకు ఏం ఢోకా వుండదు,కాని వారి ప్రాణాలకే గ్యారంటీ వుండదు.ఎప్పుడు ఎవడో ఒకడు దాడిచేయడం అకారణంగా చంపడం.అసలు వాడెందుకు చంపుతున్నాడో,వాడికే తెలియదు.కాని చావుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఇప్పుడు అమెరికాలో చంపడం అనే కల్చర్ ఫ్యాషన్‌గా మారింది.ఈ కల్చర్ పడగవిప్పి మరిన్ని ప్రాణాలను బలిగొన్నది.టెక్సాస్‌లో నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి కాల్పుల మోత మోగింది.టెక్సాస్‌లోవున్న ఒడెస్సా ప్రాంతంలో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా,మరో 21మంది తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుల్లో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.దీనిపై స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.



ఈ కాల్పులు జరిపిన వ్యక్తి శ్వేతజాతీయుడిగానే భావిస్తోన్నట్లు,నిందితుడి వయసు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.క్షతగాత్రులకు ఒడెస్సా మెడికల్ సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స అందజేస్తున్నారు.కాగా వీరిలో రెండేళ్లలోపు వయసున్న ఓ చిన్నారి కూడా ఉండగా గాయపడినవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలియజేశారు.ఇదివరకే టెక్సాస్‌‌లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్‌ స్టోర్‌లోకి ఆగస్టు 4న గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల్లో 21 మంది వరకు ప్రాణాలు కోల్పోగా,మరో 40 మంది వరకు గాయపడ్డారు.ఈ ఘటన జరిగిన మర్నాడే ఓహియోలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇలాంటి ఘటనలు అమెరికాలో తరుచూగా ఎక్కడో ఒకచోటు చోటుచేసుకుంటునే ఉన్నాయి.అకారణంగా ప్రాణాలుకోల్పోతున్న పౌరుల విషయంలో అక్కడి ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేక పోతుందో అర్ధం కావడం లేదని ప్రజలు ఆందోళన పడుతున్నారు.ఇంటినుండి బయటకు వెళ్లిన మనిషి తిరిగొస్తాడనే నమ్మకం అమెరికాలో లేదని అనుకొంటున్నారు ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: