చంద్రబాబుని దింపేస్తాం, అధికారం నుంచి దూరం చేస్తాం, ఆయన వంటి అవినీతిపరుడు దేశంలోనే లేడు. ఆయన మీద విచారణ జరిపించి జైళ్ళో పెడతాం. ఈ మాటలు అన్నీ అన్నది బీజేపీ నేతలే. ఎన్నికలు జరిగి మూడు నెలలు కాలేదు. మళ్లీ బాబు సీఎం కావాలని బీజేపీ కోరుకుంటుందా. ఓ దేశ ప్రధాని ఏపీకి రావడానికి వీలు లేదు అని హూంకరించిన చంద్రబాబుని నెత్తిన పెట్టుకోవడానికి బీజేపీ మళ్ళీ రెడీ అవుతుందా. పోలవరం బాబుకు ఏటీఎం లా ఉంది అంటూ బాబు అవినీతి చేశారని  బాహాటంగా ఏపీ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ అన్న తరువాత కూడా బీజేపీ చంద్రబాబుతో దోస్తీ చేస్తుందా.


ఏమో.. ఈ ప్రశ్నలకు సమాధానం  సులువే.  రాజకీయాల్లో  ఏమైనా సాధ్యమేనని  చెప్పుకోవాలి. లేకపోతే తన మీద దాడి చేసి తన ఇంటి ముందు టీడీపీ నేతలు నానా యాగీ చేస్తే దాన్ని మరచిపోయి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయాణ బాబుతో ఎందుకు గొంతు కలుపుతారు. టీడీపీ నుంచి జంప్ చేసిన మాజీ తమ్ముడు సుజనా చౌదరితో కలసి ఎందుకు అమరావతిలో పర్యటిస్తారు. బాబు పాలనే నయం అంటూ ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే నిన్నటి గొడవలు పొలిటికల్ స్టంట్లు అనుకోవాలేమో


ఇక ఈ ధైర్యంతోనే కదా విశాఖకు చెందిన టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బీజేపీతో కలసి వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని బాహాటంగా చెప్పేస్తున్నారు. అంటే చంద్రబాబు అవినీతి చేయలేదు, తాము వూరికే అబద్ధాలు చెప్పామని బీజేపీ నేతలు అయినా ఒప్పుకోవాలి. లేకపోతే బాబు అవినీతి చేసినా మాకు ఆయనే దిక్కు మళ్ళీ అవుతాడని అయినా చెప్పుకోవాలి. ఇక టీడీపీ సైతం మోడీ వల్ల వ్యవస్థలు అన్నీ చెడిపోయాయని చెప్పి వూరూరా బాకా  వూదింది తప్పు అని ఒప్పుకోవాలి.


లేకపోతే ప్రధాని చెప్పినట్లుగా పోలవరం ఏటీయం గా వాడేసుకున్నామని, అయినా బీజేపీకి తామంటే ప్రేమ ఎక్కువై మళ్ళీ వచ్చిందని అయినా చెప్పుకోవాలి.  మాజీ మంత్రి అయ్యన్న మాటలు వింటూంటే జనం పిచ్చి వాళ్ళు అనుకోవాలేమో. ఇంకా ఎన్నికలు అయి నిండా నాలుగు నెలలు కాలేదు, రెండు పార్టీలలో  ఏ మార్పు వచ్చిందని కలుస్తారు, దీనికి పోనీ అయ్యన్న అయినా సమాధానం చెప్పగలరా.


మరింత సమాచారం తెలుసుకోండి: