రేషన్ షాపుల డీలర్ షిప్ ల కోసం అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇది ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారింది. ఒక్కో గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉండడం వారంతా తమ వర్గానికే డీలర్ షిప్ లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ ఉండటంతో వారు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అధికారంలోకి కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంలో రేషన్ డీలర్ల రగడ సహజం. అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన రేషన్ డీలర్ లను తొలగించి కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి చెందిన వారు వాటిని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉండటం అందుకు ప్రభుత్వ అధికారులు సహకరించడం జరుగుతుంది. అయితే ఈ సారి సీఎం జగన్ సారథ్యంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం గ్రామ వ్యవస్థ సమూల మార్పులకు శ్రీకారం పలికింది.



వాలంటీర్ లే ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో డీలర్ షిప్ లకు పెద్దగా పోటీ ఉండదని భావించారు. అయితే రేషన్ డీలర్ లు కొనసాగుతారని వారు నిర్వహించే షాపులు గ్రామంలో స్టాక్ పాయింట్ లుగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొంత మేర మళ్లీ ఆ వైపు అధికార పార్టీ కింది స్థాయి నాయకులు దృష్టి పెట్టారు. ఉన్న టిడిపి అనుకూల డీలర్ లను మార్చి మాకు ఇవ్వాల్సిందేనని లాభనష్టాలతో సంబంధం లేదని కింది స్థాయి నాయకులు నేతలపై ఒత్తిడి పెంచారు. దీంతో అధికార పార్టీ ప్రజా ప్రతి నిధులు ఆ వైపు దృష్టి సారించి గత ప్రభుత్వంలో నియమితులై గత సాధారణ ఎన్నికల్లో తనకు సహకరించలేదని భావిస్తున్న డీలర్ల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం పలికారు.



పరిస్థితిని గమనించి కొన్ని ప్రాంతాలలో డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా మరి కొందరు ప్రస్తుత అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునే కార్యకర్తలకు శ్రీకారం పలికారు. ఇంకొందరు ఢీ అంటే ఢీ అంటూ తమను ఎలా తొలగిస్తారు చూస్తామన్న పంథాలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో వైసిపి నాయకులు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను రంగంలోకి దింపారు. స్వచ్ఛందంగా తప్పుకోని పాత డీలర్ల పై వారు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు.



ఫలితంగా జిల్లాలో వందలాది మంది డీలర్ల పై 6A కేసులు నమోదు చేశారు. జిల్లాలో రెండు వేల నూట యాభై రేషన్ షాపులు ఉండగా ఇప్పటికే ఇరవై శాతానికి పైగా డీలర్ల పై 6A కేసులు నమోదయ్యాయి. చీమకుర్తి మండలం మువ్వావారిపాలెంలో ఒక డీలరు తనకు అనుకూలంగా హై కోర్టు నుంచి ఉత్తర్వులు పొందినప్పటికీ అమలుకి నోచుకోలేదు. మంత్రి బాలినేని ఒంగోలు నియోజకవర్గంలో గతంలో లేని విధంగా ఈ పర్యాయం ఈ విషయంలో సూటిగా వ్యవహరిస్తున్నారు. అయితే కేసులు పెట్టడం కన్నా తప్పుకొని వారిని పక్కన పెట్టి తాను సూచించిన వారి ద్వారా డీడీలు తీయించి వారికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: