వైసీపీ పాలన పై ప్రజలకు వంద రోజుల్లోనే నిజంగానే  విరక్తి పుట్టిందా..? ఈ వంద రోజులూ  తెదేపా నాయకుల పై  దౌర్జన్యాలు చేయించడం తప్పించి,  వైసీపీ పార్టీ చేసిందేమీ లేదా..?  జగన్,  ఇసుక కొరతతో లక్షల మంది పేదల ఉపాధి మార్గాలను కూల్చారా ?    ప్రస్తుతం చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పై ఇలాంటి ఆరోపణలనే బలంగా వినిపిస్తున్నారు.  పైగా ఈ రోజు అరకు ప్రాంతానికి చెందిన మాజీ వైసీపీ నేత దొన్ను దొరతో పాటు మాజీ సర్పంచ్‌ లు, ఇతర ప్రజా ప్రతినిధులు.. గుంటూరు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి మరి తెదేపాలో చేరారు. గిరిజనుల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వారు పార్టీలో చేరుతూ చెప్పుకొచ్చారు. అసలు ఈ మధ్య కాలంలో  టీడీపీ నుండి పోవటమే గాని, చేరటం అనేదే లేదు. అలాంటి ఈ పరిస్థితుల్లో  మాజీ వైసీపీ నేతతో  మాజీ సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు తెదేపాలో చేరడం ఆశ్చర్యకరమే.  ముఖ్యంగా  ఇసుక కొరత సృష్టించింది కేవలం వైసీపీ నేతల జేబులు నింపడానికే అని తెదేపా మొదటి నుంచీ చెబుతోంది. ఇసుకను తవ్వడం దగ్గర నుంచి తరలించడం, నిల్వచేయడం, అమ్ముకోవడం వరకూ అంతా అక్రమమే అని, వైసీపీ నేతల కనుసన్నలలో అంతా జరుగుతోంది కాబట్టి,  ఈ అక్రమాల మీద జగన్  ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని  బాబులిద్దరూ ట్విట్టర్ సాక్షిగా మొత్తుకుంటున్నారు.   


ఇప్పటికే  పల్నాడుతో సహా ఇతర ప్రాంతాలలో వైసీపీ కారణంగా నివాసం కోల్పోయిన బాధితులందరికీ, గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గుంటూరు ఆశ్రయం కల్పించింది టీడీపీ.  పైగా ఆ  బాధితులకు శిబిరాలు ఏర్పాటు చేశారు. నిజంగానే వైకాపా నేతలు తెదేపా కార్యకర్తల ఇళ్ళ పై  దాడులు చేస్తున్నారా..? వాళ్ళను  భూములు సాగు చేసుకోనివ్వడం లేదా ? టీడీపీ కార్యకర్తలను గ్రామాలను ఖాళీచేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారా ? పోలీస్ లు కూడా ఈ  దౌర్జన్యం గురించి పట్టించుకోవడం లేదా ? ఇవ్వన్నీ  నిజం అయితే..  జగన్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటికైనా జగన్ ఈ ఆరోపణల పై ఆరా తియ్యాలి. వాటిలో ఏ మాత్రం వాస్తవం ఉన్నా.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే.. అభిమానమే ఆగ్రహంగా మారుతుంది. అయినా మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం.  పౌరులందరికీ నివసించే హక్కుంది. ప్రజలందరికీ భావవ్యక్తీకరణ స్వేఛ్చ ఉంది. వీటిని అణిచి వేయాలని చూడటం సమాజానికి మంచింది కాదు.  ఈ హక్కులన్నిటినీ కాలరాస్తే..  అధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేసుకుంటే పోతే.. ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే ఇసుక, మరియు  ఐదు రూపాయిల భోజనం పథకం విషయంలో ప్రజలు జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అవి విమర్శలు పెరగకముందే జగన్ మేల్కోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: