గోదావరి జిల్లాల కాపు నేతలు టిడిపికి షాకిస్తూ వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా టిడిపికి రాజీనామా చేసి తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందిన వరుపుల రాజా త్వరలో వైసీపీ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే టిడిపి నుండి ఎవరో వస్తారనుకుంటే రాజే వస్తున్నాడా అంటూ ప్రత్తిపాడు వైసీపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు వరుపుల రాజా. ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తలపై పలుమార్లు కేసులు పెట్టించారు. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసిపి గాలిలో రాజా ఓటమి చవిచూశారు. ఎన్నికల వరకు వైసీపీని బద్ధశత్రువులా చూసిన వరుపుల రాజా సడన్ గా ప్లేట్ ఫిరాయించారు. టిడిపి కాపు సామాజికవర్గాన్ని విస్మరించిందని అరోపణలు మొదలు పెట్టారు. టీడీపీలో ఉండగా ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులకు బిసి రిజర్వేషన్ ల కోసం పోరాడితే రాజా ఏనాడూ పట్టించుకోలేదు.



ఆలాంటి ఆయన ఒక్కసారిగా మాట మార్చడంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల పాటు దశల వారీగా కాపు ఉద్యమం నడిచింది. ఏనాడూ వరుపుల రాజా నోరు మెదపలేదు. ఎన్నికల్లో ఓటమి అనంతరం కాపులకు టిడిపిలో అన్యాయం జరుగుతోందని గళం విప్పడం రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. వరుపుల రాజా ఆకస్మికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి టిడిపికి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా టిడిపిపై ఆరోపణలు సంధించారు. రాజా రాజీనామా వైసీపీలో చేరిటం కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ సమక్షంలో రాజా వైసీపీ కండువా కప్పుకుంటారు. గత ఎన్నికల్లో వరుపుల రాజాకు టిడిపి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం ఉండి సంకేతాలొచ్చాయి. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కాదని ఆయన మనవడు అయిన వరుపుల రాజాకు టికెట్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన వరుపుల సుబ్బారావు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ప్రత్తిపాడు ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ రావు గెలుపులో సుబ్బారావు కీలక పాత్ర పోషించారు.


మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు కారణం గానే టిడిపి అభ్యర్థిగా వరుపుల రాజా ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. ఇప్పుడు వరుపుల రాజా కూడా అధికార వైసీపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. రాజా వైసీపీలో చేరుతున్నారన్న సంకేతాలపై ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ రావు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గంలోని గ్రామాలూ మండలాల వారీగా వైసీపీ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యతిరేకిస్తున్నారు. రాజాను వైసీపీలో చేర్చుకోవద్దని నిరసన తెలియజేస్తున్నారు. వరుపుల రాజా టిడిపికి రాజీనామా చేసిన మరుక్షణం నుండే ప్రత్తిపాడు నియోజకవర్గంలో కలవరం మొదలైంది. ప్రతిపక్ష టిడిపికి అన్యాయం చేసి రాజా ఎందుకు వైసీపీ వైపు చూస్తున్నారని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా అవకతవకలకు పాల్పడినట్లుగా రాజాపై ఆరోపణులున్నాయి.



ఈ ఆరోపణలను కప్పిపుచ్చడానికి ఆస్తులు కాపాడుకోవడానికి అధికార వైసీపీ వైపు తొంగి చూస్తుంటారని ఇటు టీడీపీ అటు వైసిపి నేతలు భావిస్తున్నారు. వరుపుల రాజా వైసీపీలో చేరితే ప్రత్తిపాడు నియోజక వర్గ వైసీపీలో వర్గపోరు మొదలవుతుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ రావు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఒకే వర్గంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. వరుపుల రాజా పార్టీలో చేరితే మరో వర్గాన్ని కూడగడతారు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కోసమే వరుపుల రాజా వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, టిడిపిలలో వరుసగా ఇప్పటికి ఆయన రెండుసార్లు బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. తిరిగి ఆ పదవి దక్కించుకుంటే తనపై ఉన్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన అంటోంది ప్రత్యర్థి వర్గం. ఇలాంటి పరిస్థితుల్లో వరుపుల చేరిక పై వైసీపీ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: