పంజాబ్‌ గురుదాస్‌పూర్‌లోని ఓ బాణాసంచా ప్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో  30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది.  ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవన శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై గుర్‌దాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ట్వీట్ చేశారు. బటాలా ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.


మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. అయితే మృతులతో పాటు, గురుదాస్‌పూర్‌ బటాలాలోని నివాస ప్రాంతాల్లో ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా కుప్పకూలిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు.


మృతుల కుటుంబాలను, తీవ్రంగా గాయాపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్న పోలీసులు ప్రమాదానికి గల  కారణాలను తెలుసుకుంటున్నారు. బాణసంచా ఫ్యాక్టరీకి ఏ మేరకు అనుమతులున్నాయి...బాణసంచా తయారు చేసే ప్రాంతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులు ఆరా తీస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: