ప్రకాశం జిల్లాలో టిడిపికి బిగ్ షాక్ తగలబోతోందా.? ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా.? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి హవాలోనూ ప్రకాశం జిల్లాలో టిడిపి నాలుగు సీట్లు గెలుచుకుంది. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి కరణం బలరాం, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, కొండెపి నుంచి డాక్టర్ స్వామి గెలిచారు. నలుగురు టిడిపి ఎమ్మెల్యేలలో కరణం, గొట్టిపాటి పార్టీ మారుతారని నియోజకవర్గాల్లో భీభత్సంగా న్యూస్ వైరల్ అవుతోంది. రెండు వేల పద్నాలుగులో అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత టిడిపిలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి మళ్లీ గెలిచారు.


అయితే గొట్టిపాటి రవి మనసు వైసిపి వైపు లాగుతుందని తెలుస్తోంది. టిడిపిలో అయిష్టంగానే కొనసాగుతున్న ఆయన అసెంబ్లీ సమావేశాలను, పార్టీ సమావేశాలలో అంత యాక్టివ్ గా ఉండటం లేదని అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే రవితో బీజేపీ నేతలు మంతనాలు సాగించారు. కానీ ఆయన మాత్రం వైసీపీ లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పెద్దలతో మంతనాలు చేశారని యోజకవర్గంలో అనుచరులు చెబుతున్నారు. అంటే జగన్ పాలసీ ప్రకారం పార్టీ మారితే గొట్టిపాటి రవి రాజీనామా చేసి వెళ్లాల్సి ఉంటుంది.



అందుకు రవి సిద్ధమయ్యాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం గొట్టిపాటి రవి విదేశాల్లో ఉన్నారు. త్వరలోనే ఆయన నియోజకవర్గానికి వస్తారు. అప్పుడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో డేరింగ్, డైనమిక్, డ్యాషింగ్ రాజకీయాలకు పెట్టింది పేరు కరణం బలరాం. జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. దీంతో అతనికి గాలమేస్తోంది బిజెపి, ఇప్పటికే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులతో పాటు ఇతర కాషాయ నేతలు ఆయనతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా కరణం బలరాంను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


అయితే ఆమంచితో ఉన్న వైరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో కరణం వైసీపీ వైపు చూడటం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పార్టీ మారే నిర్ణయం తీసుకుంటే బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే బలరాం మాత్రం ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేస్తున్నారు. తనకు ఏ పార్టీలో చేరేది లేదని సన్నిహితుల దగ్గర స్పష్టంగా చెప్పేశారట. అయితే బీజేపీ నేతలు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా బలరామ్ వెంట పడుతూనే ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరో ఆరు నెలల్లో జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని ప్రచారం నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: