తనపై కక్షసాధింపు దేనికంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ తీహార్‌ జైల్లో ఉన్న చిదంబరం సోషల్‌ మీడియాలో ఎలా యాక్టీవ్‌గా ఉన్నారనే ప్రశ్న అందరిలో కలుగవచ్చు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై... జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబం. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆయన... కేంద్రంపై విరుచుకుపడడం మాత్రం తగ్గించలేదు. ఈ కేసులో మరో 12 మంది అధికారులకు సంబంధం ఉన్నా... తననే ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నిస్తున్నారు.  


ట్విట్టర్‌ వేదికగా ఈ ప్రశ్నలు సంధించారు చిదంబరం. ఆయన జైల్లో ఉన్నప్పటికీ... తన తరఫున ట్వీట్‌ చేయాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరడంతో ఇది సాధ్యమైంది.  ఐఎన్ఎక్స్ మీడియా కేసుతో సంబంధమున్న డజను మంది అధికారులపై చర్యలు తీసుకుంటే... నేను అరెస్టయ్యే వాడిని కాదని ప్రజలంటున్నారు. మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. చివర్లో మీరు సంతకం పెట్టినందుకేనా అని అడుగుతున్నారు... అయితే ఆ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదంటూ ట్వీట్‌ చేశారు.  


సెప్టెంబర్‌ 5న ఆయన తీహార్‌ జైలుకు వెళ్లారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుకు వెళ్లకుండా ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తిహార్‌ జైల్లోని 7వ నంబర్‌ బ్యారక్‌లో చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించారు అధికారులు. వెస్ట్రన్‌ టాయిలెట్ మినహా ప్రత్యేక వసతులేవీ సమకూర్చలేదు. ఆహారంగా పప్పు, రోటీ, కూర, అన్నం అందిస్తున్నారు. మిగతా ఖైదీల లాగే, చిదంబరానికి లైబ్రరీ, టీవీ వద్ద నిర్ణీత సమయాన్ని గడిపే అవకాశం కల్పించారు జైలు అధికారులు. చిదంబరం జైల్లో ఉన్నా కూడా కుటుంబ సభ్యుల సహకారంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా బీజేపీ నాయకత్వంపై విమర్శలు సంధించడం ఆ పార్టీ వర్గాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: