పార్లమెంటులో చంద్రబాబునాయుడుకు షాక్ తగిలింది. అంటే టిడిపి ఎంపిలెవరూ పార్టీకి రాజీనామా చేయలేదు లేండి. అయితే షాక్ ఏమిటంటారా ? 1989 నుండి టిడిపి చేతిలోనే ఉన్న పార్లమెంటులోని కార్యాలయం చేజారిపోయింది. పైగా టిడిపి చేతిలో ఉన్న కార్యాలయాన్ని తీసేసుకుని అదే కార్యాలయాన్ని వైసిపికి కేటాయించటం చంద్రబాబుకు చాలా మంటగా ఉంది.

 

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ఎంపిల సంఖ్యాబలాన్ని బట్టి పార్లమెంటు సచివాలయం అధికారులు కార్యాలయ గదులు కేటాయించటం అందరికీ తెలిసిందే. ఎక్కువమంది ఎంపిలున్న పార్టీలకు గ్రౌండ్ ఫ్లోర్ లో కార్యాలయాల కేటాయింపు మొదలవుతుంది. అలా ఎంపిల సంఖ్యాబలం తగ్గేకొద్దీ పై అంతస్తుల్లో కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది.

 

ఈ లెక్కన చూసుకుంటే  గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 5వ నెంబర్ కార్యాలయం 1989 నుండి టిడిపి చేతిలోనే ఉంటోంది. పార్లమెంటులో ఎంపిల సంఖ్యాబలంతో  సంబంధం లేకుండా ఈ గదిని టిడిపి మ్యానేజ్ చేసుకుంటోంది. అలాంటి గదిని టిడిపికి చెప్పాపెట్టకుండా పార్లమెంటు సచివాలయం ఉన్నతాధికారులు వైసిపికి కేటాయించేశారు. సెంటిమెంటుగా తమకు అచ్చివచ్చిన గదిని తమ వద్దే అట్టేపెట్టుకునేందుకు టిడిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా పప్పులుడకలేదు.

 

 చివరకు పార్టీలకు కార్యాలయాల కేటాయింపులో 5వ నెంబర్ గదిని వైసిపికి కేటాయించించటమంటే చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లే. టిడిపి కార్యాలయాన్ని వైసిపికి కేటాయించిన అధికారులు ఆ విషయాన్ని టిడిపికి మాట మాత్రం కూడా చెప్పలేదు. ఈ విషయం ఇలాగుంటే టిడిపికి అసలు కార్యాలయం గదినే కేటాయించకపోవటం మరీ విచిత్రంగా ఉంది.

 

టిడిపికి రాజ్యసభలో ఇద్దరు, లోక్ సభలో ముగ్గురు సభ్యులున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంపిల సంఖ్యాబలం ప్రకారం ఎక్కడో ఓ చోటైతే కార్యాలయం కేటాయించాల్సిందే. అలాంటిది ఎక్కడా కేటాయించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అదే పద్దతిలో అసెంబ్లీలో కూడా అధికారంలో ఉన్నపుడు టిడిపి శాసనసభాపక్షం కార్యాలయంగా ఉన్న గదిని అసెంబ్లీ అధికారులు వైసిపికి కేటాయించారు. మొత్తం మీద ఒకేసారి చంద్రబాబుకు ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటులో షాక్ కొట్టింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: