పోలిసులు నిజంగా సంచలనం సృష్టించారనే చెప్పాలి. అధికార పార్టీ నేతపై ఎక్కడైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టటం విన్నామా ? ఎక్కడో ఎందుకు మొన్నటి వరకు సిఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు హయాంలో జరిగిందా ? కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసిపి నేతపైనే కర్నూలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం వైసిపి నేతల్లోని రెండు వర్గాల మధ్య  ఆధిపత్యం గొడవలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒక వర్గానికి బైరెడ్డి సిద్దార్ధరెడ్డి నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో రెండు వర్గాలు కూడా అభ్యర్ధి గెలుపు కోసం  బాగా  కష్టపడి పనిచేశాయి. సరే ఎవరెలా పని చేసినా అభ్యర్ధి ఆర్ధర్ మాత్రం మంచి మెజారిటితో గెలిచారు.

 

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నా చితకా పనులుంటాయి కదా ? అక్కడే రెండు వర్గాలకు మధ్య గొడవలు పెరిగిపోయాయి. పనులన్నీ తమకే కవాలంటూ ఏ వర్గానికి ఆ వర్గమే పట్టుబట్టాయి. దాంతో గొడవలు మరింతగా పెరిగిపోయాయి. వీళ్ళ మధ్య మంత్రి పంచాయితీ  చేద్దామని అనుకున్నా సాధ్యం కాలేదు.

 

ఇంతలో ఏమైందో ఏమో ఎన్నికల్లో జరిగిన గొడవను అడ్డం పెట్టుకుని ఓ వర్గం బైరెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదయ్యేలా పోలీసులపై ఒత్తిడి పెట్టింది. ఒత్తిడిని తట్టుకోలేక పోలీసులు కూడా బైరెడ్డిపై ఏ 13గా కేసు బుక్ చేశారు. అది సరిపోదన్నట్లుగా తాజాగా బైరెడ్డి మీద పెట్టిన ఏ 13 ను కాస్త ఏ 8గా మార్చాలని పోలీసులపై ఒత్తిడి మొదలుపెట్టారట.

 

దాంతో విషయం తెలుసుకున్న బైరెడ్డి మండిపోతున్నారు. తనపై  ప్రత్యర్ధి వర్గం చేస్తున్న కుట్రను జగన్ దృష్టికి బైరెడ్డి తీసుకెళ్ళారట. దాంతో నియోజవర్గం పంచాయితి ఇపుడు జగన్ ముందుకెళ్ళింది. మరిపుడు జగన్  ఈ పంచాయితిని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: