జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 14న విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. నాలుగు వారాలలోగా కౌంటర్ అఫిడవిట్స్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్డికల్ 370 రద్దు రాజ్యాంగబద్దంగా జరిగిందా..? లేదా..? అన్న దానిపై రాజ్యాంగ  ధర్మాసనం విచారణ చేపడుతుంది.  


జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేసే అంశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకుందా ? జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేస్తూ తీసుకువచ్చిన చట్టం చెల్లుబాటు అవుతుందా ? ఆర్టికల్ 370 తోపాటు 35 A ని రద్దు చేయడం రాజ్యాంగబద్దంగానే జరిగాయా...?  ఇవే ప్రశ్నలు ఇప్పుడు సుప్రీం కోర్టు ముందుకు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎన్‌ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మానసం ఈ పిటిషన్ లను విచారిస్తోంది. 


ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ లపై కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలని న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. రెండు వారాలకు మించి గడువు ఇవ్వొద్దన్న పిటిషనర్ల వాదనను  రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. కౌంటర్ అఫిడవిట్ లు దాఖలైన తర్వాత వాటిపై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ లకు వారం రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు బెంచ్.  


వాస్తవానికి ఈ నెల 31 నుంచి జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం అమలులోకి వస్తుంది. అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్...అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్ అమలులోకి వస్తాయి. అయితే ఆర్డికల్ 370 రద్దు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ లు వాదిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేనప్పుడు... గవర్నర్ పాలన కొనసాగుతున్నప్పుడు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నది పిటిషనర్ల వాదన. అయితే అన్ని న్యాయసూత్రాలను పాటిస్తూ...రాజ్యాంగబద్దంగానే నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోంది. జమ్మూకశ్మీర్ విభజన చట్టంపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు హోంమంత్రి అమిత్‌ షా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే 1968లో సంపత్ ప్రకాశ్ వర్సెస్ జమ్మూకశ్మీర్ కేసులో  సుప్రీం తీర్పును పిటిషనర్‌లు ప్రస్తావిస్తున్నారు. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటేనన్న వాదనను అప్పట్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 370 కొనసాగాలని చెప్పింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: