మార్కెట్లోకి అడుగు పెట్టింది మొద‌లు..సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న రిల‌య‌న్స్ దిగ్గ‌జం ముఖేష్ అంబానీ మాన‌స పుత్రిక అయిన జియోకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు ట్విస్ట్ ఇవ్వాల‌ని చూస్తే...ఇప్పుడు అదే రీతిలో స‌ద‌రు సంస్థ‌లు సైతం షాకిచ్చాయ‌ని అంటున్నారు. ఫోన్ రింగ్ సమయాన్ని 25 సెక‌న్ల‌ జియో తగ్గించిన నేపథ్యంలో ఇతర టెలికం సంస్థలు ఇదే బాటపట్టాయి.  ప్రస్తుతం 30 నుంచి 45 సెకన్లుగా ఉన్న ఫోన్ రింగ్ స‌మ‌యాన్ని 25 సెకన్ల‌కు త‌గ్గిస్తూ...టెలికం సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఎంపిక చేసిన సర్కిళ్లలో నిర్ణ‌యం తీసుకున్నాయి.ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌కు సమాచారం అందించినట్లు స‌మాచారం.


ఫోన్ రింగ్ సమయాన్ని 25 సెకన్ల‌కు తగ్గించిన ఎపిసోడ్ ఊహించ‌ని మలుపులు తిరుగుతోంది. ఈ రింగ్ సమయం తగ్గింపుపై జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల మధ్య భేదాభిప్రాయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనిపై నియంత్రణ మండలి ట్రాయ్ హెచ్చరికలు జారీచేసింది. ముందుగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అన్ని టెలికం సంస్థలు చర్చించుకోవాలని సూచించింది. దీనిపై ఈ నెల 14న సమా వేశం నిర్వహించబోతున్నట్లు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, రింగ్ సమయాన్ని 25 సెకన్ల‌కు  తగ్గించిన విషయాన్ని సెప్టెంబర్ 28న ట్రాయ్ కార్యదర్శికి ఎయిర్‌టెల్ సమాచారం అందించింది. దీంతోపాటు వొడాఫోన్ ఐడియా కూడా ఎంపిక చేసిన సర్కిళ్లలో రింగ్ కాలపరిమితిని 25 సెక‌న్ల‌కు తగ్గించినట్లు తెలుస్తున్నది. దీనిపై కంపెనీ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.


మ‌రోవైపు, జియో నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వచ్చే కాల్స్‌ను జియో బలవంతంగా డిస్‌కనెక్ట్ చేస్తున్నదని ఎయిర్ టెల్ ఆరోపించడం టెలికం సంస్థల మధ్య మరోమారు కోల్డ్‌వార్ ప్రారంభమైనట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలాఉండ‌గా, ఇప్పటికే భారీ నష్టాలతో సతమతమవుతున్న టెలికం సంస్థలకు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి(ఐయూసీ)లు తగ్గడం ద్వారా కొంత ఊరట లభించనుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: