పేకాటలో గొడవ కార‌ణ‌మో...లేదా దోపిడి దొంగ‌ల చ‌ర్యనో పోలీసులు ఇప్ప‌టికీ స్ప‌ష్టంగా నిర్ధార‌ణ‌కు రాలేక‌పోయిన‌ప్ప‌టికీ...కాల్పుల మోతతో అమెరికా మరోమారు దద్దరిల్లింది. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లి న్ ప్రాంతంలో ఓ క్లబ్బులో శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులంతా పురుషులు కాగా, గాయపడిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉన్నారు.దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనకు సంబంధించి ఇప్పటివరకైతే ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు.


బ్రూక్లిన్‌లోని వీక్స్‌విల్లే పరిసరాల్లోని 74 యుటికా అవెన్యూలో ఈ ఘటన జరిగింది. కాల్పులు చోటుచేసుకున్న క్లబ్బు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నదని చెప్పారు. క్లబ్బులో జూదం తదితర ఆటలు ఆడుతారని.. ఆట మధ్యలో గొడవ జరుగడం లేదా దోపిడీ దొంగల వల్ల ఈ కాల్పులు జరుగొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్లబ్బులోకి ప్రవేశించిన దుండగుడు(లు) కనీసం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలిలో రెండు తుపాకులను కనుగొన్నామని, మరికొన్ని దొరికే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులను అధికారులు సమీప దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. బాధితుల వయసు 32 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.


ఇదిలాఉండ‌గా, గ‌త‌వారంలో ఓ బార్‌లో సైతం ఇదే రీతిలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాన్సస్‌ నగరంలోని టెక్విలా కేసీ అనే బార్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కనీసం ఇద్దరు దుండగులు ఈ కాల్పులకు పాల్పడి ఉండవచ్చని కాన్సస్‌ నగర పోలీస్‌ విభాగ అధికార ప్రతినిధి థామస్‌ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తొలుత బార్‌లోని వారితో దుండగులకు వాగ్వాదం జరిగిందని, తర్వాత వారు బయటకు వెళ్లి తుపాకులతో తిరిగివచ్చారని వివరించారు. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో సుమారు 40 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులందరూ స్పానిష్‌ మాట్లాడేవారని వెల్లడించారు. వారి లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని భావిస్తున్నామని, అయితే ఇది జాత్యహంకార దాడి కాకపోవచ్చని పోలీసులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: