ఏపీ సీఎం జగన్ - మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తిని రేపుతోంది. సైరా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి... ఆ సినిమా చూడాలని ఆహ్వానించేందుకు జగన్ ను కలవబోతున్నారు. మామూలుగా అయితే ఇది సాధారణ విషయం. కానీ జగన్-చిరంజీవి మధ్య గతంలో ఎప్పుడూ స్నేహ సంబంధాలు లేవు. పైగా పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యర్ధిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరి సమావేశం చర్చనీయాంశమైంది.  


సైరా ఎంత సక్సెస్ అయ్యిందో... మెగాస్టార్ చిరంజీవి ఏసీ సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారన్న వార్తలూ అంతే సంచలనం అయ్యాయి. ఈ సోమవారం తాడేపల్లి వెళ్తున్న చింరంజీవి, రాం చరణ్ సీఎం నివాసంలో జగన్ ను కలవబోతున్నారు. సైరా సినిమా ఎక్కువ షోలు ప్రదర్శించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి కృతజ్ఞతలు చెప్పడంతోపాటు... సినిమా చూడాలని జగన్ ను చిరంజీవి కోరబోతున్నారు. అయితే గతంలో ఎప్పుడూ వీరిద్దరి మధ్య ఇలాంటి భేటీలు జరగకపోవడమే ఇప్పటి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 


జగన్ తో చిరంజీవికి నేరుగా ఎప్పుడూ విభేదాలు, వివాదలు లేకపోయినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో స్నేహ సంబంధాలు కూడా లేవు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.... అదే ఏడాది కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు జగన్. సోనియాతో విభేదించి కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వెళ్తే... ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు చిరంజీవి. 2009 ఎన్నికల్లో యువ రాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ అప్పటి సీఎం వైఎస్  టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. పంచెలు ఊడగొడతామంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు లేకపోయినా సఖ్యత కూడా లేకుండాపోయింది. చిరంజీవి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి కావడం, కాంగ్రెస్ కు జగన్ ప్రత్యర్ధిగా ఉన్నా... చిరంజీవి ఎప్పుడూ ఆయన్ను విమర్శించలేదు. 


2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్.. టీడీపీ, బీజేపీలతో కలిసి వైసీపీతో తలపడ్డారు. అప్పటి నుంచి జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు పవన్. జగన్ ఎలా సీఎం అవుతారో చూస్తానని పవన్ అంటే..... కార్లు మార్చినట్టు భార్యలను మార్చారు పవన్ అంటూ పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేసే వరకు జగన్ వెళ్లారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలా ఎవరికి వారు అన్నట్టుగా ఉన్న ఈ రెండు ఫ్యామిలీలు ఇప్పుడు కలవడమే ఆసక్తిగా మారింది. తెలంగాణ గవర్నర్ తమిళసై ని కలిసిన చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా చూడాలని కోరడం ఆమె చూడటం, అభినందించడం జరిగిపోయాయి. ఇప్పుడు జగన్ ను కూడా అదే పర్పస్ తో కలుస్తున్నారు చిరంజీవి. 


జగన్ తో చిరంజీవి భేటీ కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పేరుతో వచ్చిన ఓ ట్వీట్ హీట్ ఎక్కించింది. జగన్ అరెస్ట్ సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని రాం చరణ్‌ ట్వీట్ చేశారని.... ఇప్పుడు అదే రాం చరణ్ తండ్రితో కలిసి జగన్ ను కలవాలని అనుకోవడం కాల మహిమ అంటూ చెవిరెడ్డి పేరుతో ట్వీట్ వచ్చింది. దానికి సైరా పేరుతో కౌంటర్ ట్వీట్లు వచ్చాయి. దీంతో జగన్-చిరు భేటీ పై పాత విషయాల ఎఫెక్ట్ ఎంత ఉంటుందోనన్న అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. అయితే తాను ఎలాంటి ట్వీట్లు చేయలేదని.. .అసలు తనకు ట్వీట్టర్ ఎకౌంటే లేదని చెవిరెడ్డి చెప్పడంతో ఆ వివాదం సద్దు మణిగింది. 


మొదటి నుంచి టీడీపీకి దగ్గరగా ఉండే సినిమా రంగ పెద్దలు... జగన్ కు దూరంగా ఉన్నారు. ఒకరిద్దరు చిన్నా చితకా నటులు తప్ప సీనియర్లంతా జగన్ ను కలవడానికి కూడా ఇప్పటి వరకు ఇష్టపడలేదు. 151 సీట్లతో ఘన విజయం సాధించిన జగన్ ను మా ఇంత వరకు అభినందించను కూడా లేదు. అలాంటిది  మెగాస్టార్ స్వయంగా జగన్ ను కలవబోతుండటంతో సినీ రంగానికి- జగన్ కు మధ్య కొత్త బంధం మొదలైనట్టేనని అంటున్నారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఓ వర్గం ఉంది. ఆ వర్గం జగన్ కు అనుకూలంగా మారుతుందా? లేదా? అన్నది చూడాలి. తమ్ముడు పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ మీద ఈ భేటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా నడుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: