ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు... పోలీసుల కాల్పులతో చిలీ అట్టుడుకుతోంది. ఐదు రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో 15 మందికి పైగా చనిపోయారు. శాంటియాగోలో విద్యార్థులు, ట్రేడ్‌ యూనియన్లు నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. లాటిన్‌ అమెరికా దేశమైన చిలీలో గత కొంత కాలంగా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మెట్రో చార్జీలను పెంచడంతో ఒక్క సారిగా జనం ఆగ్రహం కట్టలు తెగింది. రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపున్న వాళ్లను అణగదొక్కేందుకు చేసిన ప్రయత్నాలు కాస్తా బెడిసికొట్టాయి. లాఠీచార్జీలు, కాల్పులు ప్రజల కోపాన్ని రెట్టింపు చేశాయి. రోడ్లపై వాహనాలు దగ్ధం చేశారు ఆందోళనకారులు. ఇంకొందరు షాపులను లూటీ చేశారు.    


జనాగ్రహం చూసి అధ్యక్షుడు సెబాస్టియన్‌ వెనక్కి తగ్గారు. మెట్రో చార్జీలను పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడంతో పాటు  జనాన్ని ఆకట్టుకునే కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించారు. పెన్షన్లు 20 శాతం పెంచుతామని... విద్యుత్‌ చార్జీలను పెంచబోమని తెలిపారు సెబాస్టియన్‌. అలాగే, ఖరీదైన వైద్యానికి అయ్యే భారాన్ని ప్రభుత్వం భరించేలా చట్టం చేస్తామని ప్రతిపాదించారు. కానీ... జనం మాత్రం శాంతించడం లేదు. కాల్పుల్లో ఆందోళనకారులు పిట్టల్లా రాలిపోతున్నా... అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినెరాను గద్దె దించే వరకూ తగ్గేది లేదంటున్నారు.   


సెబాస్టియన్‌ పినెరా ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న ఆందోళనకారులు పిలుపునిచ్చిన సమ్మె విజయవంతమైంది. చిలీ రాజధాని శాంటియాగోలో విద్యార్థులు, కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. దేశంలోని మిగతా నగరాల్లో కూడా ఉపాధ్యాయులు, కార్మికులు, హెల్త్‌కేర్‌ వర్కర్లు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లను ప్రదర్శించారు. అయితే... చాలా వరకూ ర్యాలీలు శాంతియుతంగా జరగడం విశేషం. నిరసన ప్రదర్శనలు, అల్లర్లకు సంబంధించి ఇంత వరకూ 6 వేల మందిని అరెస్ట్‌ చేశారు చిలీ పోలీసులు. లాఠీ చార్జీలు, పోలీసులు జరిపిన కాల్పుల్లో 15 మందికి పైగా ఆందోళనకారులు చనిపోయారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినెరా... పరిస్థితిని చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో చిలీలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: