సుదీర్ఘ‌కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె గురించి స‌వివ‌రంగా మీడియా ముఖంగా తెలియ‌జెప్పారు. స‌మ్మె పేరుతో యూనియన్లు చేస్తున్న పని మహా నేరమని మండిప‌డ్డారు. ఆర్టీసీని ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడని తెలిపారు. ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవ్వడూ కాపాడలేరన్న సీఎం..ప్రస్తుతం కార్మికులకు  జీతాలు ఇవ్వాలంటే బస్టాండ్లు అమ్మే పరిస్థితిలో ఆర్టీసీ ఉందన్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని చెబుతూ భూగోళం ఉన్నంత‌వ‌ర‌కు విలీనం జ‌ర‌గ‌ద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ  హామీ ఇచ్చారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే అంశంపై కమిటీని నియమించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయితే 53,261 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరగనుంది. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందనున్నాయి. ఈ అంశాల‌ను పేర్కొంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సైతం త‌మ‌ను స‌ర్కారులో విలీనం చేయాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. 


దీనిపై తాజా విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఏపీలో ఆర్టీసీ ప్ర‌భుత్వంలో విలీనం కాలేద‌ని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడానికి కమిటీ వేసిందే కానీ, అది ఏమవుతోందో ఎవరికీ తెలీదని అన్నారు. ఆ కమిటీ ఇంకా మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో నివేదిక ఇస్తుందని తెలిపారు. అది కేవలం ప్రయోగం మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ గురించి ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా..ఆర్టీసీ కార్పొరేష‌న్ అని పేర్కొంటూ ఒక‌రికి చేస్తే..మ‌రికొంద‌రు వ‌స్తార‌ని తెలిపారు. ఈ భూగోళం ఉన్నంత‌వ‌ర‌కు ఆర్టీసీ విలీనం కాద‌న్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి ఇప్పటికే రూ. 4,250 కోట్లు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్ లోనూ ఎక్కువ రూపాయలు కేటాయిస్తున్నాం.. అయినా ఆర్టీసీ బస్సులతో రోజూ రూ.3కోట్ల నష్టం వస్తుందన్నారు. ఆర్టీసీ దగ్గర రూపాయిలేని పరిస్థితి అని కేసీఆర్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: