ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే చట్టం చేసిన ఘనత ఏపీదేనన్నారు. సూరంపల్లిలో సీపెట్ ను ప్రారంభించిన సీఎం జగన్, కేంద్రమంత్రి సదానంద గౌడ.. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. యువతను సరైన మార్గంలో నడిపిస్తే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. 


కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు. సీపెట్‌ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీపెట్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం చేసిన తొలి రాష్ట్రం ఏపీదేనని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి. యువతను ప్రోత్సహించేందుకు చట్టాన్ని తీసు​కొచ్చామని వివరించారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా యువతలో నైపుణ్యాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నామని స్పష్టం చేశారు. సీపెట్‌ లాంటి సంస్థలు మరిన్ని రావాల్సి ఉందని ఆకాంక్షించారు. ఇలాంటి సంస్థలను మరిన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని అన్నారు ఏపీ సీఎం జగన్.


ఇక...సీఎం జగన్‌తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు కేంద్రమంత్రి సదానంద గౌడ. ఏపీలో ఇలాంటి సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అందించిన సహకారం అభినందనీయం అని కొనియాడారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి సంస్థలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. యువతను సరైన విధానంలో ఉపయోగించుకుంటే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 37 సీపెట్‌ కేంద్రాలున్నాయని అన్నారు. మరో అయిదుచోట్ల సీపెట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు కేంద్రమంత్రి సదానంద గౌడ. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రితో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో  సీపెట్‌ భవనాలను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: