ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల బాధితులైన వారికి అండ‌గా ఉంటాన‌ని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాప్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం మంగళగిరిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా తమ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ప్రైవేట్ మ‌ద్యం షాపులు ఉన్నప్పుడు వాటిలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న తాము ఇప్పుడు రోడ్డున ప‌డ్డామ‌ని వాపోయారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసేందుకు వయసు ఎక్కువ అంటూ అనర్హులుగా చేశారని ఫలితంగా 30 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో మద్యం అక్రమంగా బయటకు వెళ్తోంది అని ఎక్కడా బెల్ట్ షాపుల అమ్మకాలు తగ్గలేదని మండిప‌డ్డారు.  కొత్త విధానంతో తమ చిన్న జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాప్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పిన అంశాల‌ను, సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ వయో పరిమితి, విద్యార్హత అంటూ చిరుద్యోగులను తొలగించడం భావ్యం కాదన్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్ర‌భుత్వం సైతం వీరి ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాల‌ని జ‌న‌సేనాని కోరారు.


ఇదిలాఉండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అక్టోబర్‌ ఒకటోతేదీ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3500 దుకాణాలు ఏర్పాటు చేశారు. 3448 షాపులను టెండర్ల పద్ధతిలో అద్దెకు తీసుకున్నారు. వాటిలో 3500 మంది సూపర్‌వైజర్లు, 8033 మంది సేల్స్‌మెన్లను నియమించారు. ఈ నిర్ణ‌యం గురించి ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి మీడియాకు వివ‌రిస్తూ...మహిళల కష్టాలను తీర్చేందుకు దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా భావించిందని, 4390 షాపులను ఏర్పాటుచేసి ప్రతిషాపునకు పది బెల్టుషాపులు పెట్టిందని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి సిఎం అయిన వెంటనే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారని, రాష్ట్రంలో బెల్టుషాపులను పూర్తిస్థాయిలో నిర్మూలించామని వివరించారు. బెల్టుషాపుల నిర్వాహకులపై 4788 కేసుల్లో 2834 మందిని అరెస్టు చేశామని చెప్పారు. 18 బోర్డర్‌ మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇంటర్‌స్టేట్‌ బోర్డర్లో 31 చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని వివరించారు. బెల్టుషాపుల నిర్మూలనలో ఎక్సైజ్‌ అధికారులు చిత్తశుద్ధితో పనిచేశారని, శాఖలో ఖాళీగా ఉన్న 678 కానిస్టేబుళ్ల పోస్టు లను భర్తీ చేయాలని ప్రతి పాదన పంపామ న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: