ఆర్టీసీ కార్మికులు దసరాను బాధసప్త హృదయాలతో గడిపారు. కనీసం దీపావళి పండగను అయినా ఆనందంగా గడపాలని ఆశించారు కాని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో అధికారులు జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఎర్రమంజిల్‌ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఈడీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో పాటు మరో ముగ్గురు కో-కన్వీనర్లు భేటీకి హాజరయ్యారు. ఇకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.


సమావేశం నుంచి జేఏసీ నేతలు అర్ధంతరంగా బయటకొచ్చారు. యాజమాన్యం 21 డిమాండ్ల పైనే చర్చకు అంగీకరించిందని.. 26 డిమాండ్లపై చర్చ జరగాలని తాము పట్టుబట్టామని జేఏసీ నేతలు తెలిపారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. పూర్తి నిర్బంధ పద్ధతిలో చర్చలు జరిగాయని ఆరోపించారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మె యథావిథిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఇకపోతే చర్చలు జరిగిన తీరుపై జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో కంటి తుడుపు చర్యగా చర్చలు జరిపారని పేర్కొన్నారు.


కార్మిక సంఘాల తరఫున కేవలం నలుగురినే చర్చలకు అనుమతించారని తెలిపారు. తమ ఫోన్లను లాక్కొని స్విచ్ఛాఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె ఆపే ప్రసక్తే లేదని అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. కోర్టు ఆదేశాలను వాళ్లకు అన్వయించుకునే పద్ధతిలో చర్చలు జరిపారని.. సమస్యను పరిష్కరించే ఉద్దేశం కనిపించలేదని ఆరోపించారు. అధికారులు పేర్కొన్న 21 అంశాలు ఏంటో కూడా తమకు చెప్పలేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. పూర్తిగా ప్రభుత్వం నియంత ధోరణిని అవలంభిస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: