లేటుగా వ‌చ్చినా...లేటెస్టుగా అని ఓ సినిమాలో ఉన్న డైలాగ్‌ను నిజం చేసేలా...ఒకింత ఆల‌స్యంగా వ‌చ్చిన వ‌ర్షం ఈ ద‌ఫా తెలుగు రాష్ట్రాల ప‌దేళ్ల‌ ఉమ్మ‌డి రాజ‌ధాని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల అనే తేడా లేకుండా...అన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలే దంచాయి. హైద‌రాబాద్‌ను క‌లుపుకొని తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వ‌ర్షాల గురించి తాజాగా వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెలువ‌రించిన స‌మాచారం ప్ర‌కారం...అక్టోబర్‌లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడం.. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. అక్టోబర్‌లో సగటు వర్షపాతం 84.1 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 137.1 మి.మీ. వర్షం కురిసింది. త‌ద్వారా 63 శాతం అధిక వర్షపాతంతో కొత్త రికార్డు న‌మోదు అయింది. 


వ‌ర్షాకాలంలో ఆయా మాసాల వారీగా చూస్తే....జూన్‌లో సాధారణంగా 132 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 85.7 మి.మీ. వాన కురిసి.. 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులైలోనూ 7 శాతం లోటు వర్షం పడింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 227 మి.మీ. కాగా, 260 మి.మీ. వాన పడి.. సగటు కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం రికార్డయింది. అక్టోబర్‌లో ఆదిలాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల్లో 100 నుంచి 220 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 759.6 మి.మీ కురవాల్సి ఉండగా, 805.6 మి.మీ. వర్షం కురిసి.. సగటు కంటే 6 శాతం ఎక్కువ వర్షం పడింది. సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 163.9 మి.మీ. కాగా, 241.1 మి.మీ. వర్షం కురిసింది. ఇది సగటు కంటే 46 శాతం అధికం కావడం విశేషం.


ఇదిలాఉండ‌గా, నేడు సైతం వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర శ్రీలంక నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడడం, పశ్చిమ అసోం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండ‌టం వ‌ల్ల ఆది, సోమవారాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నది. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: