కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన‌ హూజూర్‌నగర్ ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ ఓట‌మి పాలై...టీఆర్ఎస్ గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. రికార్డు స్థాయి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ ఓటమి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న  ఉత్తమ్ కుమార్ పదవికి ఎసరు పెట్ట‌నుంద‌నే చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ భార్య పరాజయంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో ఉత్తమ్‌కు వ్యతిరేకంగా నేతలు గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఒక్కో నేత‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నారు.


కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మేర‌కు ఓ ఆస‌క్తిక‌ర పత్రిక ప్రకటన విడుద‌ల చేశారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో  ఉత్తమ్ పద్మావతి గెలిస్తే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. ఆమె ఓడిపోయారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యాడని విశ్లేషించారు. ``హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఓటమి ఉత్తమ్ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎలాంటి డోకా లేదు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాలా ధైర్యవంతుడు...ఎవరూ ఆయనకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వేరే వాళ్ళు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నిక‌లో అధికార పార్టీకి లాభం చేకూరుతుంది. ఉప ఎన్నిక‌లు రాజకీయంగా ఏ పార్టీకి  రెఫరెండం కాదు.`` అని వివ‌రించారు.


ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి గురించి ప‌లువురు నేత‌లు అంత‌ర్గ‌తంగా, బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉత్తమ్ హస్తిన పర్యటనకు వెళ్లడం ఆయన మార్పు ఖాయమన్న ఊహాగానాలకు తెరలేపింది. పార్టీ శ్రేణుల కథనం ప్రకారం అధిష్టానం కూడా ఉత్తమ్ స్థానంలో టీపీసీసీ చైర్మన్ గా మరొకరిని నియమించాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు. దీంతో టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో తాను ఉన్నానని సీనియ‌ర్ నేత‌ వీహెచ్ ప్రకటించారు. మ‌రోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రబాకర్, కోమటిరెడ్డడి వెంకటరెడ్డి వంటి వారు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: