దీపావళి పండుగ వాళ్ల జీవితాల్లో చీకట్లు నింపింది. టపాసులు పేలి కళ్లల్లో నిప్పురవ్వలు పడడంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. వాళ్ల కంటి చూపును కాపాడేందుకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు డాక్టర్లు. కుటుంబమంతా సరదాగా చేసుకునే దీపావళి పండుగలో అక్కడక్కడా అపశృతులు జరిగాయి. మతాబులు, చిచ్చుబుడ్లు, టపాసులు తారాజువ్వలు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొందరు ప్రమాదాల బారినపడ్డారు. చార్మినార్‌కు చెందిన పదేళ్ల బాలుడు అహ్మద్ టపాసులు కాలుస్తుండగా... అతని కుడి కంట్లో నిప్పురవ్వలు పడ్డాయి. సైదాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ ఎడమ కంట్లో నిప్పురవ్వలు పడ్డాయి. అత్తాపూర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు జంగమ్మ కుడి కంట్లో టపాసుల తుంపర్లు పడ్డాయి.  దీంతో ఆమె కంటి తీవ్ర గాయమైంది. లాల్ దర్వాజలో 14 ఏళ్ల బాలుడు వేదాంత్ సైకిల్ పై వెళ్తుండగా... అతని కుడి కంట్లో టపాసులు పడ్డాయి. దీంతో కన్ను ఎర్రగా మారిపోయింది.  


గాయమైన కళ్లల్లోంచి రక్తం కారుతున్న చిన్నారుల పరిస్థితిని చూసే వాళ్ల గుండెలు బరువెక్కుతున్నాయి. సరోజనీ దేవి కంటి ఆసుపత్రికి చికిత్స కోసం 20 మంది రాగా... వాళ్లలో నలుగురికి తీవ్ర గాయాలున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో మరో 12 మంది బాధితులు వచ్చారు. కళ్లలో టపాసులు పడిన సందర్భాల్లో రెటీనా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇలాంటి కేసుల్లో పరీక్షలు చేసి... అసరమైన వాళ్లకు ఆపరేషన్లు చేస్తామంటున్నారు. కోల్పోయిన చూపును తిరిగి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామంటున్నారు డాక్టర్లు. టపాసుల తుంపర్లు కళ్లకు తగిలితే... వెంటనే నీటితో శుభ్రం చేయాలి. తర్వాత సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మొత్తానికి దీపావళి కొందరి జీవితాల్లో చీకట్లు నింపింది. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని మనమూ కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: