మహారాష్ట్ర రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. అధికారానికి రిమోట్ కంట్రోల్ తమ దగ్గరే ఉందని శివసేన ప్రకటించింది. మరోవైపు తన బలాన్ని పెంచుకోవడానికి స్వతంత్రుల్ని కూడా ఆ పార్టీ ఆకర్షిస్తోంది. శివసేన ప్రత్యామ్నాయాలు ఆలోచించాలన్న కాంగ్రెస్ సూచన.. బీజేపీకి టెన్షన్ పుట్టిస్తోంది. 


మహారాష్ట్రలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని శాసించగలిగే  స్థితికి తాము చేరుకున్నామంటోంది శివసేన.  2014లో 63 సీట్లను సాధిస్తే, ఇప్పుడు 56 సీట్లనే సాధించామన్నంటున్న ఆ పార్టీ నేతలు... రిమోట్ కంట్రోల్ మాత్రం తమ దగ్గరే ఉందంటున్నారు. బీజేపీని వెనకుండి శాసించాలని ఎప్పటి నుంచో కల కంటున్నామనీ, ఈ ఎన్నికల్లో అది కార్యరూపం దాల్చిందని శివసేన నేతలు ఆనందపడుతున్నారు. పులి, దాని మెడలో గడియారం, దాని చేతిలో ఉన్న ఓ కమలం పువ్వు వాసనను పులి చూసే కార్టూన్‌ను ఊరికే చేయలేదని, ఆ కార్టూన్ ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతుందని ఆ పార్టీ చెబుతోంది. 


మరోవైపు ఇద్దరు స్వతంత్రులతో పాటు మహారాష్ట్ర ప్రహార్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా శివసేనకు మద్దతు ప్రకటించారు. బీజేపీ, శివసేనతో అధికారం పంచుకోవాలని కోరారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో ఆగిపోవడంతో.. అధికారం పంచుకుంటామని రాతపూర్వక హామీ అడుగుతోంది శివసేన. మరోవైపు అధికారం కావాలనుకుంటే శివసేన ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని కాంగ్రెస్ సలహా ఇచ్చింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని, ఆకలేసిందని పులి గడ్డి తినదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 


త్వరలో ఫడ్నవీస్, అమిత్ షా, ఉద్ధవ్ థాక్రే జరిపే చర్చలు కీలకంగా మారాయి. శివసేన పంతం నెగ్గుతుందా.. బీజేపీ మంత్రాంగం పారుతుందా అనేది చూడాల్సి ఉంది. ఆదిత్య థాక్రేను సీఎంగా చూడాలనుకుంటున్నఉద్ధవ్ థాక్రే అంత తేలిగ్గా దారికి రారనే వాదన కూడా వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: