మాజీ మంత్రి, సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని దగ్గుబాటి వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారట. దగ్గుబాటి రాజీనామా విషయంపై పార్టీలో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  వైసిపిలో దగ్గుబాటి బిజెపిలో ఆయన భార్య పురంధేశ్వరి ఉండటం వల్ల వైసిపికి ఇబ్బందిగా ఉందని స్వయంగా జగన్మోహన్ రెడ్డే అన్నారట.

 

దగ్గుబాటేమో పార్టీలో అంత క్రియాశీలకంగా లేకపోవటం అదే సమయంలో భార్య జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతుండటంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. తన భార్య జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతుంటే దగ్గుబాటేమో కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అదే సమయంలో మిగిలిన నేతలు కూడా పురంధేశ్వరి ఆరోపణలపై ఘాటుగా స్పందించాలన్నా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే పురంధేశ్వరిని కూడా వైసిపిలోకి తీసుకురమ్మని చెప్పారు. ఇద్దరికీ సముచిత ప్రాధాన్యత ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఒకవేళ పురంధేశ్వరిని వైసిపిలోకి తీసుకురాలేకపోతే ఏం చేయాలో నిర్ణయించుకునే అవకాశాన్ని దగ్గుబాటికే ఇచ్చారు జగన్. మొదటి నుండి కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది కూడా లేదులేండి.


అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత పురంధేశ్వరి బిజెపిలోనే కంటిన్యు అవ్వాలని డిసైడ్ అయ్యింది. అంటే దగ్గుబాటే వైసిపికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా దగ్గుబాటి ఫోన్లో చెప్పారట. తనతో పాటు తన కొడుకు హితేష్ చెంచురామ్ కూడా వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారట. 

 

అంటే వైసిపిలో  దగ్గుబాటి ప్రయాణం మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసింది. ఎన్నికలకు ముందు వైసిపిలోకి వచ్చిన దగ్గుబాటి ఎన్నికలైన నాలుగు మాసాలకు బయటకు వెళ్ళిపోతున్నారు. రాష్ట్రమంతటా వైసిపి ప్రభంజనం వీచినా పర్చూరులో మాత్రం దగ్గుబాటి ఓడిపోవటం విచిత్రమే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: