ఆదాయ‌పు ప‌న్ను చెల్లించే వారికి కేంద్రం తీపిక‌బురు చెప్ప‌బోతోంద‌ని...గ‌త కొద్దికాలంగా ఊరింపులు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.  దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్ధతను తొలగించేందుకు గత నెల కార్పొరేట్‌ పన్నును మోదీ సర్కారు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వినీమయ సామర్థ్యం పెంపునకు వ్యక్తిగత ఆదాయం పన్నునూ తగ్గించనున్నారన్న ఊహాగానాలు బయలుదేరాయి. కానీ...ఈ ప్ర‌చారం ఓ పెద్ద కామెడీ అని తాజాగా స్ప‌ష్ట‌మైంది. ఆదాయం పన్ను (ఐటీ) రేట్లలో ఎటువంటి తగ్గింపులు ఉండబోవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 


కేంద్ర ప్రభుత్వం వరుస సంస్కరణలను ప్రకటిస్తూ....దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.  దీంతో ఎప్పట్నుంచో ఉన్న కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు డిమాండ్‌నూ పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్‌లో 10 శాతం మేర కుదించింది. ఈ క్రమంలోనే వ్యక్తిగత ఆదాయం పన్నూ తగ్గొచ్చన్న అంచనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని ప్రభుత్వ లీకులతో తేటతెల్లమైంది. దీంతో స‌హ‌జంగానే  వేత‌న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి జీవుల‌కు నిరాశ ఎదురైంది.


ఇదిలాఉండ‌గా, గ‌త ఆగ‌స్టులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. 58 ఏళ్ల‌ క్రితం రూపొందించిన ఆదాయం పన్ను చట్టాలను పూర్తిగా మార్చివేయడానికి కేంద్రం గతంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ పలు కీలక సిఫారసులు చేసింది. వీటిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారిపై విధిస్తున్న 20 శాతం ఆదాయం పన్నును 10 శాతానికి, రూ.20 లక్షల లోపు ఆదాయం కలిగిన వారిపై విధిస్తున్న పన్నును 30 శాతానికి బదులుగా 20 శాతం వసూలు చేయాలని ఈ కమిటీ సిఫారస్ చేసింది. ప్రస్తుతం ఉన్న 5 శాతం, 20 శాతం, 30 శాతం పన్నులకు బదులుగా..5 శాతం, 10 శాతం, 20 శాతం, 30 శాతం, 35 శాతం చొప్పున ఐదు స్లాబ్‌లు విధించాలని ఈ ప్రత్యేక ప్యానెల్ సూచించింది. అయితే, ఈ మార్పులు జ‌ర‌గాలంటే... టాస్క్‌ఫోర్స్ సూచనలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రం ఆ దిశ‌గా సాగ‌డం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: