జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీ స‌మ్మె గురించి ఆయ‌న స్పందిస్తూ...ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు...తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న‌కు పెద్ద తేడా లేద‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలోని ప‌రిస్థితులు...ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఒకేలా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో టీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె వివరాలను, తమ డిమాండ్లను వివరించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని, సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. జేఏసీ నేతలతో చర్చించిన అనంతరంపవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ...ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


``నవంబర్ 3వ తేదీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నాం. విశాఖపట్నం వెళ్లే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. ఆయన్ని కలసి కార్మికుల సమస్యలు వివరిస్తాను. వారి 24 డిమాండ్లు కేసీఆర్ దృష్టిలో పెడతాను. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపాలని, సానుకూలంగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవిస్తాం. ఆయనతో మాట్లాడే అవకాశం రాని పక్షంలో కార్మిక నాయకుల భవిష్యత్ ప్రణాళికకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం.`` అని ప్ర‌క‌టించారు.


తాను ఇంత వేగంగా స్పందించేందుకు గ‌ల కార‌ణాల‌ను సైతం ప‌వ‌న్ వివ‌రించారు. ``27 రోజుల ఉద్యమంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాను రాను సమస్య పీటముడిలా మారి కొలిక్కిరాకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల మద్దతు, వారు చేసిన పోరాటం తీసిపారేయలేనివి. ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వ పెద్దలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. సోషలిస్ట్ డెమోక్రసీ విధానాన్ని అవలంభించే మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమ బాధను చెప్పుకునే హక్కు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అవసరం. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాం. 48 వేల మంది కార్మికులు మాత్రమే కాదు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని వేల కుటుంబాలు ఆకలితో బాధ పడడం ఎవరికీ మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సమయంలో రైతుల ఆవేదన ఎంతగా కలచివేసిందో, ప్రస్తుత సమస్య కుడా నన్ను అంతే కలచివేస్తోంది`` అని...చంద్ర‌బాబును, కేసీఆర్‌ను ఆయా స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పందించే తీరులో...ప‌వ‌న్ ఒకేగాట‌న క‌ట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: