ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిపై కొత్త ఆశ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌లే తిరు నక్షత్ర మహోత్సవం(64వ జయంతి వేడుకలు) హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో అట్ట‌హాసంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన జీయ‌ర్ స్వామి..మ‌రోరూపంలో వార్త‌ల్లోకి ఎక్కారు. గత 26 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు  చినజీయర్‌ స్వామిజీని కలిశారు. తాము పడుతున్న కష్టాలను…చేస్తున్న సమ్మెను స్వామీజీకి తెలిపారు. ఆయన కూడా వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. ఆర్టీసీ కార్మికులు కలిసిన నేప‌థ్యంలో...త‌న ప్రియ శిష్యుడైన కేసీఆర్‌కు చినజీయర్ స్వామిజీ ఏమైనా సూచ‌న‌లు చేస్తారా అనే ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. 


శంషాబాద్ స‌మీపంలోని ముచ్చింతల్‌లో గ‌ల చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశ్రమానికి  రాజేంద్రనగర్‌, మహేశ్వరం ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు వెళ్లి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ  డిమాండ్లు న్యాయమైనవైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను పట్టించుకుని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్మికుల సమస్యలను విన్న స్వామీజీ సానుకూలంగా స్పందించారు.


తిరున‌క్ష‌త్ర కార్య‌క్ర‌మంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ...తెలంగాణ రాజకీయాల్లో కొత్తఒరవడి సృష్టించి దూసుకుపోతున్న కేసీఆర్ బక్కోడు… గొప్పోడు.. ధైర్యవంతుడని అన్నారు. ఏదైనా చాలా నిక్కచ్చిగా మాట్లాడడం ఆయన నైజమన్నారు. మనస్సుల్లో ఉన్నది ధైర్యంగా చెప్పగలిగే స్వభావం రాజకీయాల్లో నాయకుల్లో చాలా తక్కువ మందికి ఉంటుందన్నారు. చాలా మంది నాయకులు దేవుళ్ళ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారన్నారు. కానీ కెసిఆర్ అందుకు వ్యతిరేకమన్నారు. ఆయనలో భక్తి, భావాలు చాలా మెండుగా ఉన్నాయన్నా రు. కెసిఆర్ చేసి న యజ్ఞాలు, యాగాలు దేశంలో మరో ముఖ్యమంత్రి కూడా చేయలేదన్నారు. ఇంతటి స్ప‌ష్ట‌త ఉన్న స్వామీజీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గురించి స్పందిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. 


మరింత సమాచారం తెలుసుకోండి: