ప్ర‌పంచం చూపును త‌న‌వైపు తిప్పుకొనేలా సంస్కృతి, ప్ర‌త్యేక‌త‌లు, అభివృద్ధితో ముందుకు సాగుతున్న హైద‌రాబాద్ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త చేరింది. ప్రపంచంలోని సృజనాత్మక నగరాల జాబితాలో మన హైదరాబాద్‌కు స్థానం దక్కింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి రాజధానిని ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా 66 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు లభించగా, అందులో మన దేశం నుంచి రెండు నగరాలను ఎంపికచేయడం విశేషం. హైదరాబాద్ నగరాన్ని ఆహారం (గ్యాస్ట్రోనమీ) విభాగంలో ఎంపికచేయగా, ముంబై నగరం సినిమారంగం నుంచి స్థానం దక్కించుకుంది.


యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌గా...మన దేశంనుంచి 12 నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం దరఖాస్తులు పంపాయి. అందులో ఎనిమిది నగరాలు మాత్రమే నియమిత సమయంలో నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులను యునెస్కోకు సమర్పించాయి. దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్, ముంబై, లక్నో, శ్రీనగర్ మరో నాలుగు నగరాలు మాత్రమే నామినేట్ కాగా, అందులో హైదరాబాద్, ముంబై నగరాలకే క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించింది. ఈ సందర్భంగా మొత్తం ఏడు విభాగాల్లో క్రియేటివ్ నగరాలను ఎంపికచేశారు. ఇందులో హైద‌రాబాద్ స్థానం ద‌క్కించుకుంది.


హైద‌రాబాద్ ఈ విశిష్ట‌త‌ను సొంతం చేసుకోవ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, దేశ, విదేశాలకు చెందిన ఆహార పదార్థాలకు మన నగరం పెట్టింది పేరు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, రంజాన్ మాసంలో లభించే హలీంతోపాటు దేశంలో మరే ఇతర నగరంలో లభించని విధంగా అనేక తినుబండారాలు మన నగరంలో లభిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల రుచికరమైన ఆహార పదార్థాలు నగరంలో లభ్యమవుతున్నాయి. భిన్న మతాలు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన మన నగరం వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజలతో మినీ భారత్‌గా వర్ధిల్లుతున్నది. అన్ని రాష్ర్టాలకు చెందిన మిఠాయిలు, ఆహారపు అలవాట్లు మన నగరంలో సర్వసాధారణమై పోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. వీటితోపాటు బెంగాలీ, గుజరాతీ స్వీట్లు కూడా మన నగరంలో అందుబాటులో ఉన్నాయి. నగర జనాభాలో దాదాపు 12 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారంలో ఉపాధి పొందుతున్నారు.హైదరాబాద్ నగరాన్ని క్రియేటివ్ సిటీల జాబితాలో చేర్చడంపట్ల పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: