గిరిజనుల సంప్రదాయాలను కాపాడుకోవడం ఓ సవాలుగా మారిందన్నారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్.  విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఆర్థిక స్థితిగతులు వారికి ప్రభుత్వాల నుంచి అందుతున్న పథకాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయనగరం పర్యటనలో భాగంగా సాలూరు, పాచిపెంట మండలాల్లో పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో గుమడాం గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ చేరుకుని అక్కడ మొక్కలు నాటారు. సాలూరులోని గిరిజన గర్భిణీల వసతి గృహాన్ని సందర్శించారు. మహిళలతో కాసేపు మాట్లాడిన గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాచిపెంటలోని అమ్మవలస గ్రామానికి చేరుకొని అక్కడ వారితో గ్రామసభ నిర్వహించారు. తనకు ఒడిషాలో ఉన్నప్పటి నుంచే గిరిజన సమస్యలు తెలుసుననీ, గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తానని తెలిపారు.


గిరిజనులు విద్యావంతులైనప్పుడే.. వారి అభివృద్ధి సాధ్యపడుతోందని.. అందుకోసం అధికారులు కృషి చేయాలని సూచించారు గవర్నర్‌. ప్రజారోగ్యం కోసం ఏఎన్ఎం, పీహెచ్‌సీలు ఎన్ని ఉన్న భౌగోళిక పరమైన సమస్యలున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతరం గిరిజనులకు నలభై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే రాజన్నదొర, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


గిరిజనులు స్థానిక సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు దశాబ్ధాల నుంచి అపరిష్కృతంగా ఉన్న కోఠియా గ్రామాల వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. విజయనగరానికి కేటాయించిన గిరిజన యూనివర్శిటిని మైదాన ప్రాంతంలో కాకుండా.. సాలురు ఏజెన్సి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న దొర విన్నపాలపై సానుకులంగా స్పందించారు గవర్నర్ బిశ్వ భూషన్ హరి చందన్. మొత్తం మీద.. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా తొలిసారి పర్యటించారు గవర్నర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: