నైతిక విలువల గురించి తెలుగుదేశంపార్టీ నేతలు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. అక్రమార్జన కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. సిబిఐ కోర్టు జగన్ పిటీషన్ ను కొట్టేసింది. ఇది విషయం. ఇంత మాత్రానికే మాజీ మంత్రులు, టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. జగన్ కు నైతిక విలువలుంటే వెంటనే సిఎం పదవికి రాజీనామా చేసేయాలని కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

వ్యక్తిగత మినహాయింపు కుదరదని మాత్రమే కోర్టు చెప్పింది. అంతేకానీ అక్రమార్జన కేసులో జగన్ దోషి అని చెప్పలేదు. ఇంతమాత్రానికే టిడిపిలోని మాజీ మంత్రులు నైతిక విలువలని, రాజీనామా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. దాదాపు పదేళ్ళ క్రిందట మొదలైన జగన్ పై విచారణలో ఇంత వరకూ  ఒక్క కేసు కూడా తేలలేదు.

 

పైగా చాలా కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టుల్లో వీగిపోతున్నాయి. మరికొన్ని కేసుల్లో సిబిఐకి కోర్టు అక్షింతలు కూడా వేసిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టిడిపి కూడబలుక్కునే జగన్ పై కేసులు పెట్టాయన్న విషయం లోకమంతా తెలుసు. తప్పుడు కేసులు పెట్టింది కాకుండా చిన్న విషయానికే జగన్ రాజీనామా చేయలని డిమాండ్ చేస్తున్నారు.

 

నిజానికి నైతిక విలువల గురించి మాట్లాడాలంటే ఓటుకునోటు కేసు బయటపడినపుడే చంద్రబాబునాయుడు సిఎంగా రాజీనామా చేసుండాలి. ఆడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా చంద్రబాబు ఇంకా బుకాయిస్తున్నారు. తనపై విచారణ జరగకుండా కోర్టుల్లో స్టే తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు.  

 

ఓటుకునోటు కేసు బయటపడినపుడు చంద్రబాబు కానీ మంత్రులు కానీ కొద్ది రోజులు అసలు మీడియాకే దొరక్కుండా మొహం చాటేశారు. అలాంటి వారు కూడా ఇపుడు నైతిక విలువల గురించి మాట్లాడేస్తున్నారు. ఓటుకునోటు కేసులో అరెస్టుకు భయపడి అర్ధరాత్రి హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయిన విషయాన్ని బహుశా ఈ మాజీ మంత్రులు మరచిపోయినట్లున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: