అధికారంలో నుండి దిగిపోయేసరికి చంద్రబాబునాయుడు కొత్త విన్యాసాలు చేయాల్సొస్తోంది. శంషాబాద్ లోని త్రిదండి చిన్నజియ్యర్ స్వామి మఠానికి వెళ్ళారు. తిరునక్షత్ర వేడుకల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఇంత వరకూ ఎవరికి ఏమీ విచిత్రంగా అనిపించలేదు. కానీ ఆశీస్సులు తీసుకునే క్రమంలో చంద్రబాబు సాంతం ఒంగిపోయి స్వామి కాళ్ళకు దణ్ణంపెట్టి ఆశీస్సులు తీసుకోవటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

స్వామి ఆశీస్సులు తీసుకోవటంలో ఆశ్చర్యమేముంది ? అని అనుకోవచ్చు. కానీ స్వామీజీల కాళ్ళకు దణ్ణం పెట్టటం, పూజలు చేయటం, గుళ్ళకు వెళ్ళ దర్శనాలు చేసుకోవటం చంద్రబాబు తత్వానికి పూర్తిగా విరుద్ధమట. అంటే పై పనులు చేసినా ఏదో జనాల కోసం చేయటమే కానీ మనస్పూర్తిగా ఏనాడూ చేయలేదని పార్టీ నేతలే చెబుతుంటారు. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే నమ్మకం. మిగిలిన విషయాలన్నీ జనాల కోసం చేసేదే.

 

ఈ విషయం గతంలో చాలాసార్లు రుజువయ్యాయి. పూజలు చేసేటపుడు కూడా కాళ్ళకున్న బూట్లను తీయరు. ఈ విషయంలో ఎన్నిసార్లు విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. శంకుస్ధాపనలు చేసినా ప్రారంభోత్సవాల సమయంలో పూజలపుడు కూడా బూట్లు తియ్యరు. కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే ఏడాదిపాటు గుళ్ళకు వెళ్ళరు, ఇంట్లో పూజలు చేయరు. కానీ చంద్రబాబు దీనికి విరుద్ధం. తండ్రి చనిపోయిన ఏడాదిలోనే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ఇంటి దగ్గరే నాగపూజలు చేశారు.

 

స్వామీజీలను దర్శించుకున్న సమయంలో కూడా ఏదో మొహమాటానికో లేకపోతే జనాల కోసం మాత్రమే వంగి దణ్ణాలు పెడతారంతే. ఇటువంటి ఘటనలన్నీ చంద్రబాబుకు సెంటిమెంటు లేదని చాటి చెబుతాయి. అదే కెసియార్, జగన్మోహన్ రెడ్డి విషయాలు తీసుకుంటే వీళ్ళు చాలా కాలంగా స్వామీజీలను కలుస్తునే ఉన్నారు. మఠాలకు వెళ్ళి వాళ్ల ఆశీస్సులు తీసుకుంటునే ఉన్నారు.

 

కెసియార్, జగన్ తరపున యాగాలు జరిగినపుడు స్వామీజీలకు సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటిది ఇపుడు చంద్రబాబు త్రిదండి స్వామి పాదాల దగ్గర వంగిపోయి దణ్ణంపెట్టి ఆశీస్సులు తీసుకోవటం కొత్త విన్యాసంగానే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: